పార్లమెంటును కుదిపేస్తున్న అదానీ అంశం

నవతెలంగాణ ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం తిరిగి ప్రారంభమయ్యాయి. గౌతమ్ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదైన వ్యవహారంపై చర్చ జరపాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తడంతో ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. దాంతో లోక్‌సభ అలా ప్రారంభమై.. మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభను కూడా ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ 11.30 గంటల వరకు వాయిదా వేశారు. తర్వాత ఉభయ సభలు ప్రారంభమైనప్పటికీ.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో రేపటికి వాయిదా పడ్డాయి.
సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాల కట్టడి కోసం ఉన్న చట్టాలను ఉద్దేశించి కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. ‘‘మన దేశ సంస్కృతికి, ఈ సామాజిక మాధ్యమ సంస్థలు చెందిన దేశాల సంస్కృతికి తేడా ఉంది. అందుకే ఈ సందేశాలకు సంబంధించిన అంశాన్ని స్టాండింగ్ కమిటీ పరిశీలించి, కఠిన చట్టాలు ఏర్పాటుకు సహకరించాలని కోరుతున్నా’’ అని అన్నారు.