ఆదర్శనగర్‌, గురుమూర్తి నగర్‌లలో నెలల తరబడి చెత్తా చెదారం

నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఆదర్శనగర్‌, గురుమూర్తి నగర్‌ ప్రధాన రహదారి రోడ్డు కానుకొని నెలల తరబడి చెత్త, చెదరాలు తొలగించకపోవడంతో భరించలేని దుర్వాసన వెదజల్లుతుండడంతో ఇండ్లల్లో ఉండలేకపోతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కుక్కలు, గేదెలు, పందులు, చెత్తా, చెదారాలను చెల్లాచెదురు చేయడంతో ఇండ్ల ముందరికే చెత్త వచ్చి నిలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఉదయం పూట ఆటోలో చెత్త, చెదరాలు వేస్తే సమస్య ఉండదని తెలిపినా కూడా తమ ఇండ్ల పక్కనే పడేసి వెళ్తున్నారని మండిపడ్డారు. కొన్ని సందర్భాల్లో ఘర్షణలు కూడా జరుగుతున్నాయన్నారు. అంతేకాకుండా దోమలు, ఈగలు వ్యాప్తి చెంది అనారోగ్యాల బారిన పడుతున్నామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది, డివిజన్‌ ప్రజాప్రతినిధులు, ఇప్పటికైనా తమ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.