‘మత్తుపదార్థాలకు బానిసలై దారి దోపిడీ’

– ముగ్గురు మైనర్లను అరెస్ట్‌ చేసిన నారాయణగూడ పోలీసులు
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
మత్తుపదార్థాలకు బానిసలై దారి దోపిడీ, నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్లను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుల్తాన్‌ బజార్‌ ఏసీపీ శంకర్‌, నారాయణగూడ సీఐ యూ. చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌ బర్గర్‌ కింగ్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేసే డి.దినేష్‌ రెడ్డి అనే వ్యక్తి ఈ నెల 13న తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో హాస్టల్‌కు తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో హిమాయత్‌నగర్‌లోని సిటీకేఫ్‌ సమీపంలోని స్ట్రీట్‌ నెం.11 వద్ద అకస్మాత్తుగా హౌండా డియో వాహనంపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి డబ్బు డిమాండ్‌ చేశారు. బాధితుడు తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో వారు మొబై ల్‌ ఇవ్వమని అడిగారు. కానీ అతడు మొబైల్‌ ఫోన్‌ ఇవ్వడానికి నిరాకరించడంతో వారు అతనిపై దాడి చేసి కత్తితో బెదిరించి మొబైల్‌ ఫోన్‌ లాక్కుని పారిపోయారు. బాధితుడు దినేష్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు, వాహన తనిఖీలలో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ ముగ్గురు దోపిడీకి పాల్పడ్డారని నిర్దారించిన పోలీసులు వారిని జువైనల్‌ హౌంకు తరలించారు. వీరిలో ఓ మైనర్‌ ఓ గ్యాంగ్‌ రేప్‌ కేసులో గతంలో జైలు శిక్ష అనుభవించాడని, మత్తుపదార్థాలకు అలవాటు పడి, దారి దోపిడీలు, నేరాలకు పాల్పడుతూ అక్రమంగా దండుకున్న డబ్బులతో జల్సాలకు పాల్పడుతున్నారని ఏసీపీ తెలిపారు. మత్తు పదార్థాల వల్ల యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయని, వాటి వల్ల కొందరు నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. తల్లి దండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా యువకులను నిరంతరం గమనిస్తూ వారి రోజు వారి కార్యకలాపాల విషయాలను గమనిస్తూ ఉండాలని ఏసీపీ శంకర్‌ సూచించారు.ఈ మేరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.