ఇంజినీరింగ్‌లో అదనంగా 14,565 సీట్లు

– మొత్తం సీట్లు 1,00,671
– కన్వీనర్‌ కోటాలో 72,275 సీట్లు
– ప్రవేశాల షెడ్యూల్‌లో సవరణ
– తొలివిడత వెబ్‌ఆప్షన్ల నమోదు గడువు 12 వరకు పెంపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ విద్యలో అదనంగా 14,565 సీట్లు మంజూరయ్యాయి. అయితే ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లోనే సీట్లు పెరగడం గమనార్హం. దీంతో ఇంజినీరింగ్‌లో మొత్తం 1,00,671 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం జీవోనెంబర్‌ 114ను విడుదల చేశారు. కొన్ని కాలేజీలు కోర్‌ గ్రూపుల్లోని 6,930 సీట్ల మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. ఆయా కాలేజీలు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) కోర్సులకు అను మతి ఇవ్వాలంటూ సాంకేతిక విద్యాశాఖకు విజ్ఞప్తి చేశాయని వివరించారు. ప్రభుత్వం వాటిని పరిశీలించి అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. దానికి ఎలాంటి ఆర్థికపరమైన భారం ప్రభుత్వం పడబోదని స్పష్టం చేశారు. కొత్తగా సీఎస్‌ఈ కోర్సులోనే 7,635 ఇంజినీరింగ్‌ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. అదనంగా రూ.27.39 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని వివరించారు. అయి తే మొత్తం 155 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఉన్న 1,00,671 సీట్లలో కన్వీనర్‌ కోటాలో 72,275 సీట్లున్నాయి. 137 ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో యాజమాన్య కోటాలో 28,396 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు గడువు 8
ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ షెడ్యూల్‌ను ప్రభుత్వం సవరణ చేసింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ గురువారం సవరణ షెడ్యూల్‌ ను విడుదల చేశారు. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు గడువు ఈనెల ఎనిమిదో తేదీ వరకు ఉందని తెలిపారు. ఈనెల తొమ్మిది వరకు ధ్రువ పత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.
ఈనెల 12 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు గడువుందని వివరించారు. ఈనెల 16న తొలివిడత సీట్లు కేటాయిస్తామని తెలిపారు. 22 వరకు ఆన్‌లైన్‌ ద్వారా సెల్ఫ్‌రిపోర్టింగ్‌ గడువుందని పేర్కొన్నారు. ఈనెల 24 నుంచి ఇంజినీరింగ్‌ ప్రవేశాల రెండోవిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. వచ్చేనెల నాలుగు నుంచి తుదివిడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆగస్టు 10న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేస్తామని వివరించారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర://్‌రవaఎషవ్‌.అఱష.ఱఅ వెబ్‌సైట్‌ ను సంప్రదించాలని సూచించారు.