అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన : జిల్లా అదనపు కలెక్టర్

– నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను గడువులోపు పూర్తి చేయాలి
నవతెలంగాణ -తాడ్వాయి 
అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని అన్నారు. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ తాడ్వాయి మండలం ఇందిరానగర్, కామారం పీటీ, రెడ్డిగూడెం గ్రామాలలోని ప్రాథమిక పాఠశాలలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్య సంవత్సరంలో తరగతులు పున ప్రారంభం అయ్యే లోపు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారులు ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా పాఠశాలలలో బడి బాట కార్యక్రమం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్య శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని , మండల ప్రత్యేక అధికారి అలెం అప్పయ్య, సమగ్ర శిక్షణ అభియాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.