చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి

నవతెలంగాణ – కంటేశ్వర్
చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి విద్యార్థినులకు పిలుపునిచ్చారు. జాతీయ బాలికల దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ‘బేటీ బచావో – బేటీ పడావో’ నినాదంతో నిర్వహించిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో తమదైన శైలిలో రాణిస్తూ ప్రతిభను చాటుకుంటున్నారని అన్నారు. ఇదివరకటితో పోలిస్తే పరిస్థితిలో చాలావరకు మార్పు వచ్చిందని, చదువుతో పాటు క్రమశిక్షణలోనూ బాలికలదే పైచేయిగా నిలుస్తోందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్ధి దశ ఎంతో కీలకమని, చదువుతోనే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని హితవు పలికారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, అంకితభావంతో ఆ దిశగా కృషి చేస్తూ గమ్యానికి చేరుకోవాలని హితబోధ చేశారు. బాలికల పట్ల తల్లిదండ్రులు సైతం వివక్షను ప్రదర్శించకుండా వారిని ఉన్నత విద్యాభ్యాసం దిశగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన ఎంతో మెరుగుపడిందని గుర్తు చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాఠశాలలే కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నాయని, ప్రభుత్వ బడులలో చదువుకున్న అనేకమంది ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని అన్నారు. నేటి పరిస్థితుల్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించడం సాధ్యపడదని, చక్కగా చదువుకుని ప్రతిభను పెంపొందించుకుంటే ప్రైవేట్ రంగంలోనూ నాలుగింతలు ఎక్కువ వేతనంతో కూడిన ఉద్యోగాలు పొందవచ్చని సూచించారు. కాగా, అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన సేవలందేలా పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఐ.సీ.డీ.ఎస్ ద్వారా అమలు చేస్తున్న సేవల గురించి అవగాహనా పెంపొందించుకుని అర్హులైన ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా బాలికల ప్రాధాన్యతను చాటుతూ విద్యార్థినులు ఆలపించిన గేయాలు అలరింపజేశాయి. పలువురు విద్యార్థినులకు సైకిళ్లతో పాటు వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అంతకుముందు విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఎస్.జయరాం, డీడబ్ల్యుఓ రసూల్ బీ, డీ.ఈ.ఓ దుర్గాప్రసాద్, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్, మైనారిటీ సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ తదితరులు పాల్గొన్నారు.