ఆది గురువు అమ్మే…

ఆది గురువు అమ్మే...‘మాతృత్వం కంటే గొప్ప హీరోయిజాన్ని నేను ఊహించలేను’ అంటాడు లాన్స్‌ కాన్రాడ్‌. ఎందుకంటే సృష్టికి మూలం అమ్మ. ఆమె లేకపోతే లేదీ జన్మ. కనిపించని దేవుళ్ల కన్నా మనల్ని కనీ పెంచిన అమ్మే మన ప్రత్యక్ష దైవం.ప్రతి వ్యక్తి జీవి తంలో తల్లి అత్యంత ప్రభావశీలమైన వ్యక్తి. బిడ్డ సమగ్రాభివృద్ధిలో అమ్మే కీలకం.అమ్మ అనే పదంలోనే ఆత్మీయత, అనురాగం, ప్రేమ, త్యాగం, నిస్వార్థం ఇమిడి ఉన్నాయి. నవ మాసాలు మోసి కని పెంచి పిల్లల కష్టసుఖాల్లో అన్ని తానై వారి ఎదుగుదలే తన లక్ష్యమై బిడ్డల విజయంలోనే తన ఆనందాన్ని చూసుకునే గొప్ప త్యాగశీలి అమ్మ.తన బిడ్డల ఎదుగుదల కోసం అమ్మ అనేక త్యాగాలకు సిద్ధపడుతుంది.పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదిగినప్పుడు అమ్మ అనుభవించే ఆనందం అనిర్వచనీయం. అందుకే మదర్స్‌ డేని తల్లులకు ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి, ఆమెపై మన ప్రేమను కురిపించడానికి, ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం జరుపుకుంటారు, అయినప్పటికీ మన తల్లులకు ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి, గౌరవించడానికి ప్రతిరోజూ మదర్స్‌ డేగా జరుపుకోవాలి.అమెరికాలో 1907 మే 12న అన్నా జార్విస్‌ అనే మహిళ తన తల్లి కోసం స్మారక సేవను నిర్వహించినప్పుడు ఈ మదర్స్‌ డే ఆలోచన మొదలైంది. అప్పటినుండి అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఈ మదర్స్‌ డే జరుపుకుంటున్నారు. 1914 నుండి అమెరికాలో జాతీయ సెలవుదినంగా మదర్స్‌ డే ప్రకటించి ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం రోజున మదర్స్‌ డే జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
ఉదయం నుండి రాత్రి దాకా అలుపెరగని శ్రమ చేస్తూ,కుటుంబ బాధ్యతలను,ఉద్యోగ బాధ్యతలను మోస్తూ కంటికి రెప్పలాగా తన బిడ్డలను చూసుకుంటూ బతికే సహనశీలురు మాతృమూర్తులే.నవ మాసాలు మోసి ప్రసవించిన తర్వాత తన బిడ్డను చూసి తాను పడ్డ ప్రసవవేదన మర్చిపోతుంది.ఆడవారికి ప్రసవం పునర్జన్మ అంటారు. ప్రసవానంతరం మాతృమూర్తులు వారి పిల్లల కోసం పునర్జన్మ పొందినట్టే.అప్పుడే పుట్టిన పసిగుడ్డును చూస్తూ తను ఆనందపడుతూ, అనుక్షణం బిడ్డను పరిరక్షిస్తూ, పర్యవేక్షిస్తారు. తన బిడ్డల మీద ఈగ వాలకుండా జాగ్రత్త పడుతూ వారి శారీరక, మానసిక ఎదుగుదలకు నిరంతరం శ్రమించే శ్రమజీవి. తన బిడ్డ ముఖంలో సంతోషాన్ని చూసి తానుపడ్డ బాధల్ని, కష్టాల్ని మర్చిపోయే త్యాగశీలి.తన బిడ్డ బుడిబుడి అడుగులు వేస్తుంటే అమ్మ ఆనందానికి అవధులుండవు.బిడ్డ పడుతూ లేస్తూ నడక ప్రారంభించగానే తన బిడ్డ నడుస్తున్నాడని సంబరపడుతూ తన చుట్టుపక్కల వాళ్లతో ఆనందాన్ని పంచుకుంటుంది అమ్మ.
మొదటిసారి తన బిడ్డ బడికి వెళ్తుంటే ఆ తల్లి మనసులో ఒకపక్క ఆనందం ,మరో పక్క భయం. ఎందుకంటే తన బిడ్డ తాను లేకుండా ఎలా ఉంటాడో అనే ఆందోళన. చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదుగుతాడనే సంతోషం.ఈ రెండిటి కలయికే మొదటిసారి బడిలోకి పంపేటప్పుడు మానసిక సంఘర్షణతో సతమతమవుతుంది తల్లి.చిన్నతనం నుండే పిల్లలకు తెలియకుండానే మంచి చెడులు నేర్పడం, గెలుపు, ఓటమని తట్టుకునే లాగా తన పిల్లల్ని తయారు చేయడం,సమాజంలో ఎలా మెదలాలి, ఎలా ఎదగాలో నేర్పే గొప్ప మానసిక శాస్త్రవేత్త, ఆది గురువు అమ్మే. తండ్రి సహాయ సహకారాలతో కుటుంబం ఎదిగేలా చేస్తూ తన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ,నిద్రాహారాలు,త్యాగం చేస్తూ పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదగాలని అనుక్షణం తపిస్తూ ఉండే గొప్ప మానవతామూర్తులు తల్లులు. ఇంటి నిర్వహణ, ఉద్యోగం నేటితరం మహిళలకు అదనపు బాధ్యతలు. కాయ కష్టం చేస్తూ బతికే తల్లులు తన పిల్లలను వారు పనిచేసే చోటుకే తీసుకెళ్లి వారి ఆలనా,పాలన చూస్తూ జీవనో పాధి పొందే శ్రమజీవి తల్లి మాత్రమే. నిద్రహారాలు మానివేసి పిల్లలను చదివిస్తూ వారి పరీక్షల రోజు తానే పరీక్షలు రాస్తున్నట్టుగా శ్రమిస్తూ పరీక్ష సమయంలో తన బిడ్డ ఆరోగ్యంగా ఉండడం కోసం పౌష్టికాహారాన్ని అందిస్తూ పరీక్షల సమయంలో తన పిల్లలు ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణులు కావాలని కోరుకుంటుంది. తన బిడ్డ పరీక్షలో విజయం సాధిస్తే తానే విజయం సాధించినట్లు సంబరపడుతూ గర్వపడుతుంది.
మాతృదేవోభవ, పితృదేవోభవ అన్నట్లుగా భారతీయ సమాజంలో తల్లిదండ్రులకు అత్యున్నతమైన, విశిష్ట స్థానం కల్పించారు. తల్లిదండ్రుల్లో ప్రథమ స్థానం తల్లిదే. ప్రపంచ దేశాలలో మదర్స్‌ డే, ఫాదర్స్‌ డే, చిల్డ్రన్స్‌ డే, బ్రదర్స్‌ డే,సిస్టర్స్‌ డే ఇలాంటి దినోత్సవాలు జరుపుకొని వారిని ఆ రోజుల్లో ఆనందంగా ఉండేటట్లు చూస్తారు. భారతీయ సమాజంలో వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాధ్యతలను నిరంతరం పర్యవేక్షిస్తూ వారి ఆలనా పాలన చూసే బాధ్యత వారి పిల్లలదే. దురదృష్టవశాత్తు భారతీయ సమాజంలో కూడా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం వాటిలో తల్లిదండ్రులను ఉంచి బాధ్యతల నుంచి తప్పు కుంటున్నారు. కలిసి ఉంటేనే కలదు సుఖం అనే నానుడిని మరిచి విడివిడిగా ఉంటూ అనుబంధాలు, ఆప్యాయతలకు దూరం అవుతూ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో బిడ్డలను హాస్టల్లో వేస్తూ ప్రేమానురాగాలకు దూరమవుతుందీ ఆధునిక సమాజం.
సోషల్‌ మీడియా మానియాలో పడి మనలను కనీపెంచిన తల్లిదండ్రులతో మాట ముచ్చటలకు కూడా దూరమవుతున్నారు. ప్రపంచంలో అత్యంత విలువైన వ్యక్తులతో ప్రతిరోజులో కనీసం ఒకసారైనా మాట్లాడాల్సిన బాధ్యత వారి పిల్లలుగా మనందరి పైన ఉంది. ఉద్యోగిగా, వ్యాపారవేత్తగా ఎంత బిజీగా ఉన్నా కన్న తల్లిదండ్రులను రోజుల్లో ఒకసారి పలకరిస్తే వారికి చాలా ఆనందంగా ఉంటుంది. తన బిడ్డల నుండి ఫోన్‌ రాగానే ఆ తల్లి కండ్లలో కలిగే ఆనందం వర్ణనాతీతం. ఉన్నత చదువులు, ఉద్యోగ వ్యాపారాలు రిత్యా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నప్పటికీ కనీసం రోజుల్లో ఒకసారి మన తల్లిదండ్రులతో ఫోన్లో నైనా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకుంటే వృద్ధాప్యంలో వారు చాలా ఆనందపడతారు.మా తల్లిదండ్రులతో ప్రతిరోజు ఏదో ఒక సమయంలో తప్పకుండా మాట్లాడుతామని మదర్స్‌ డే సందర్భంగా మనమందరం ప్రతినపూనాల్సిన అవసరం ఉంది. పండుగలకు, పబ్బాలకు అందరూ కలిపి ఆనందోత్సాహాలతో జరుపుకుంటే వారు చాలా సంతోషపడతారు.
పిల్లలు కూడా పెద్దవారితో ఎలా ఉండాలో నేర్చుకుంటూ,ప్రేమానురాగాలు, ఆప్యాయత పొందుతారు. జీవితంలో విజయం సాధించడానికి ఎల్లప్పుడూ సహాయపడే మార్గదర్శి. ఆమె వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, ఆమెను ఎల్లప్పుడూ సంతోషంగా ,సౌకర్యవంతంగా ఉంచడానికి ఎల్లప్పుడూ తమవంతు కృషి చేయాలి.పదాలు తెలియని పెదాలకు అమృత వాక్యం అమ్మ. ఆమె చల్లని ఒడిలోనే మొదలైంది మన ఈ జన్మ. కనులు తెరిచిన క్షణం నుండి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం,తన సర్వాన్ని త్యాగం చేసి అందర్నీ కనుపాపలా చూస్తూ, ఆత్మీయత పంచుతూ, వారి ఎదుగుదలకు అహర్నిశలు కృషిచేస్తూ,వారి భవిష్యత్తు కై ఇంటిని నందనవనం చేసే తల్లులకు పాదాభివందనం.హ్యాపీ మదర్స్‌ డే.
(మే12 మాతృ దినోత్సవం)
పాకాల శంకర్‌గౌడ్‌ 9848377734