రామాయణం కావ్యంలో కథానాయకుడు రాముడు. రాముడు కల్పిత పాత్రే అయినా, ఆ కావ్యం రాయబడ్డ కాలం నాటికి లక్షల సంవత్సరాలుగా ఆది మానవ జాతులు ప్రపంచ వ్యాప్తంగా జీవిస్తున్నాయి. అలాంటప్పుడు రాముడు ఆది పురుషుడు ఎలా అవుతాడు? జీవ పరిణామ రీత్యా రాముడు ఆది పురుషుడు కాదు. అది ఒక భావన అనుకుంటే – ఆ భావనకు స్ఫూర్తినిచ్చిన గౌతమ బుద్ధుడు ఏం కావాలీ? ఖుషీనగర్‌లో పవళించి ఉన్న బుద్ధ విగ్రహ స్ఫూర్తితోనే కదా వైదికులు పాలకడలిలో విష్ణుమూర్తికి రూపకల్పన చేసుకున్నారూ? విష్ణుమూర్తి అవతారాలలో ఒకటిగా చెప్పబడే రామావతారం – ఏడవది! మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ అవతారాల్ని తీసేద్దాం. అవి పూర్తి మానవ రూపం దాల్చినవి కావు. మరి వామన, పరుశురామ అవతారాలు పూర్తి మానవ రూపాలే కదా? ఆ పురాణాల ప్రకారం చూసినా కూడా రాముడు ఆది పురుషుడు కాడు. సైన్సు ప్రకారం అసలే నిలవడు. ఎందుకంటే సృష్టివాదాన్ని, అవతార వాదాన్ని సైన్సు ఒప్పుకోదు – ఇక కొన్నేళ్ళ క్రితం రాముడిపై వచ్చిన ఒక వాస్తవ సినిమా గూర్చి చూద్దాం! ఇటీవల విడుదలైన సోదిపురుష్ గురించి కాదిది రామాయణ కావ్యాన్ని ఆధారం చేసుకుని చాలా చలన చిత్రాలు వచ్చాయి. అందులో విషయాలు, పాత్రలు, సన్నివేశాలు కాలానుగుణంగా వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాలు సంతరించుకున్నాయి. మళయాళ దర్శకుడు జి. అరవింద్ ‘కాంచ సీత’లో రామాయణ కావ్యాన్ని ఒక కొత్త దృక్పధంతో దర్శించాడు. ప్రఖ్యాత మళయాళ రచయిత సి.యన్. శ్రీకాంతన్నాయర్ వాల్మికి రామాయణంలోని ఉత్తర కాండతో ప్రభావితుడై రాసిన ఒకానొక నాటికే మళయాళ చిత్రం ‘కాంచన సీత’గా రూపొందించబడింది. ఈ సినిమా పేరు రాముడు అశ్వమేధ యాగంలో తన పక్కన నిలుపుకున్న బంగారు సీత ప్రతిరూపాన్ని సూచిస్తుంది. ఈ యాగంలో అశ్వాన్ని అగ్నిదేవుడికి త్యాగం చేయడం ఒక ఆచారం. సతీ సమేతంగా చేయాల్సిన ఈ యాగం చక్రవర్తి ప్రాభవానికి చిహ్నం. రాముడు అప్పటికే పన్నెండు సంవత్సరాలుగా సతీవియోగంలో ఉన్నాడు. అందువల్ల సీతకు బదులుగా సీత ప్రతిరూపాన్ని పక్కన పెట్టుకుని యాగం కొనసాగించవచ్చని కుల గురువు వశిష్టుడు సలహా ఇస్తాడు. చిత్రానికి శ్రీకాంతన్నాయర్ నాటిక ఆధారమైనప్పటికీ, ఇది దానికి భిన్నంగా రూపొందించబడింది. చిత్రంలో సీత పాత్ర కనిపించదు. అనంతమైన ‘ప్రకృతి’ సీతగా చిత్రీకరించబడింది. సీత మనఃప్రకృత్తిని, వేర్వేరు మానసిక స్థితులను ప్రకృతిలోని వేర్వేరు ఆకృతుల ద్వారా చూపించడం జరిగింది. ఇది గొప్ప సాహసం! రామలక్ష్మణులు శంభూకుడిని చంపేందుకు వెళుతున్నప్పుడు చిత్రం ప్రారంభమవుతుంది. శంభుకుడి భార్య ప్రాధేయపడటం వల్ల వాళ్ళు అతణ్ణి క్షమిస్తారు. రామలక్ష్మణులు తిరిగి అయోధ్య చేరుకుంటారు. లక్ష్మణుడి భార్య ఊర్మిళను కలుసుకుంటారు.
అంతకు ముందే రామలక్ష్మణులు ప్రయాణించి వచ్చిన దండకారణ్యంలో సీత ఉంది. అయినా వీరు ఆమెను అక్కడే వదిలేసి వచ్చారని ఊర్మిళ నిందిస్తుంది. అందుకు రాముడు ‘సీత భర్త – కేవలం అయోధ్య ప్రజల సేవకుడు మాత్రమే’ – అని వివరణ ఇచ్చుకుంటాడు. ఆ మరునాడే అశ్వమేధ యాగం ప్రారంభించమని చెప్పడానికి వశిష్టుడు వస్తాడు. కానీ, అర్ధాంగి పక్కన లేనిది యాగం జరపడానికి వీలులేనందు వల్ల – రెండవ వివాహం చేసుకుంటే వీలవుతుందని సలహా ఇస్తాడు. ఈ విషయంలో రాముడు కోపాద్రిక్తుడవుతాడు. ఇంతలో పన్నెండేళ్ళ క్రితం అయోధ్యను వదిలి వెళ్ళిన భరతుడు తిరిగి వస్తాడు. సీత లేకుండా యాగం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తాడు. వాదోపవాదాలు మితిమీరి యుద్ధానికి సిద్ధమవుతారు. అప్పుడు ప్రకృతి మధ్యవర్తి అవుతుంది. ఆకాశం తెరుచుకుని భోరుమని కురిసిన వర్షం – వారిద్దరినీ చల్లబరుస్తుంది. యాగాశ్వంతో లక్ష్మణుడు బయలుదేరుతాడు. యాగం మొదలవుతుంది. తిరిగి తిరిగి యాగాశ్వం వాల్మికి ఆశ్రమంలో ప్రవేశిస్తుంది. అక్కడ రాముని కుమారులైన లవకుశులు పెరుగు తుంటారు. లవుడు అశ్వాన్ని బంధించి, లక్ష్మణుడితో యుద్ధానికి సిద్ధమవుతాడు. అశ్వాన్ని వదిలేయమని లక్ష్మణుడు ఆజ్ఞాపిస్తాడు. మరొకసారి ప్రకృతి తన ప్రభావం చూపుతుంది. తను చూసినదానికి విస్మయానందంలో మునిగిపోయిన వాల్మికి ఉత్తర రామ చరితరాయడానికి ఉపక్రమిస్తాడు. అశ్వాన్ని మళ్ళీ అయోధ్యకు తీసుకుపోతారు.
చేయవల్సిన ఆచారం కర్మకాండ ప్రకారం, యాగం రెండోభాగం మొదలవుతుంది. అదే సమయానికి మళ్ళీ శంభుకుడు విజృంభించాడని సంహరించేందుకు లక్ష్మణుడు వెళ్ళాడని వార్త అందుతుంది. అదే సమయానికి లవకుశులతో వాల్మికి అక్కడికి చేరుకుంటాడు. వాల్మికి యజ్ఞశాలలోకి ప్రవేశించడాన్ని వశిష్టుడు అభ్యంతరం తెలియజేస్తాడు. అతణ్ణి బహిష్కరిస్తాడు. కానీ, రాముడు లవకుశులను తన కుమారులుగా గుర్తించి హృదయానికి హత్తుకుంటాడు. అప్పుడు సీత పొందిన ఆనందం శోభాయమానమైన ప్రకృతి ద్వారా వ్యక్తీకరించబడుతుంది. రాముని మహాప్రస్థానం చిత్రీకరించడంతో చలనచిత్రం ముగుస్తుంది. రాముడు సరయూనదిలో మునిగి, సీతతో అంటే… ప్రకృతితో ఐక్యమైపోతాడు.
రాముడు దేవుడనే అభిప్రాయం సన్నగిల్లి… ఈ చిత్రం ద్వారా అతడు ఒక ఆదిమానవుడు అనే అభిప్రాయం బలపడుతుంది! హర్మాలు ఆభరణాలు, పరిచారికలు వగైరా లేకుండానే రాజసానికి ఒక కొత్త రూపును సంతరించాడు దర్శకుడు. చిత్రకళ, సంగీతం, దర్శకత్వశాఖలలో సాధికారికంగా కృషిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి గోవిందన్ అరవిందన్ (1935-1991) యాభై యారేండ్లలోనే ఆయన జీవితం అకస్మాత్తుగా ముగిసిపోయింది. భారతీయ చలన చిత్రరంగం ఒక అత్యంత ప్రతిభాశాలిని పోగొట్టుకుంది. సత్యజిత్ రే తర్వాత ఎవరూ? అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలా మంది విమర్శకులు అరవిందన్ పేరు సూచించారు. నిజానికి మళయాళంలోనే ఆదూర్ ఉన్నాడు. బుద్ధదేవ్, శ్యామ్‌బెనెగల్, మణికౌల్ వంటివారు ఎందరో ఉన్నారు. వారందరిలో లేనిది అరవిందన్ చేసిన కృషిలో ఏముందీ? అంటే, వైవిధ్యం గల సినిమాలు ఎక్కువ సంఖ్యలో తీశాడు. వివాదాస్పదమైన అంశాలకు తావులేకుండా అన్ని సినిమాలలో ఒక పరిపూర్ణతను సాధించాడు. మానసిక చైతన్యాన్ని, పరివర్తనల్ని రంగుల ప్రపంచంలోకి మార్చి వెండి తెరకెక్కించడం సులభమైన విషయం కాదు. గొప్ప సినిమా చూసి కవిత్వం రాయడం వేరు. ఆ పని చాలామంది చేయగలరు. కాని, జీవితాన్ని కవిత్వీకరిస్తూ సినిమా తీయడం వేరు. ఇది శ్రమతోనూ, ఖర్చుతోనూ కూడుకున్న పని! అంతకంటే కొన్ని రెట్ల మేధోశక్తి అవసరం. అవన్నీ అరవిందన్ సమకూర్చుకోగలిగాడు. చేసి చూపించగలిగాడు.
అరవిందన్‌కు మన తెలంగాణ ప్రాంతానికీ కొంత సంబంధం ఉంది. ఆయన ‘కాంచన సీత’ తీసింది భద్రాచలం పరిసర ప్రాంతాల్లోనే గోదావరి నదీతీరంలో. సికింద్రాబాదు రైలు బోగీలో కుంభమేళాకు పోతున్న ఒక సాధువును, హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక మైదానంలో గుడిసె వేసుకుని ఉన్న ఇద్దరు కోయసోదరులను, విజయవాడ లాడ్జిలో పట్టుబడ్డ ఒక అమ్మాయిని ‘కాంచన సీత’ పాత్రధారులుగా ఎన్నుకున్నాడు. ఆ రోజుల్లో తెలుగు పత్రికలు వీటిని కథనాలుగా ప్రకటించాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేమంటే… సినిమా రంగానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల్ని ఎన్నుకుని సినిమా తీయడమే సాహసం. అదే సినిమాతో ఇక జాతీయ బహుమతి సాధించడమంటే ఏమనాలీ? సినిమా మాధ్యమంపై ఎంత అవగాహన,ఎంత ఆత్మస్థైర్యం, ఎంత చొరవ, ఎంత విశ్లేషణా సామర్థ్యం ఉంటేనో గానీ… విజయం ఆస్థాయిలో సాధించలేడు కదా? ”గొప్ప ప్రకృతి సౌందర్యం గల కేరళను వదిలి, ఈ తెలంగాణ బీడు భూముల్లో ఏం ఉందని వచ్చారూ?” అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. ”మా కేరళలో ప్రకృతి అందాలన్నీ ఒకేచోట కేంద్రీకృతమై ఉంటాయి. అందువల్ల అప్రయత్నంగానే మనం వాటిని అక్కడ ఆనందించవచ్చు. ఇక్కడ పరిస్థితి వేరు. రమణీయమైన ప్రకృతి అందాలున్నాయి. కానీ, అన్నీ ఒక చోట లేవు. వాటిని అన్వేషించి, అన్వేషించి ఆనందించాల్సి ఉంటుంది. వెతుక్కుని సాధించి ఆనందించడంలో గొప్ప సంతృప్తి ఉంది” అని అరవిందన్ సమాధానమిచ్చారు.
‘కాంచన సీత’ విడుదలయ్యాక గోదావరి ఇసుక తిన్నెలు, చెట్లు, పూలు, ఆకాశం, పంట పొలాలు, బీడు భూములు దర్శకుడు అరవిందన్ చిత్రీకరించిన తీరుకు నమస్కరించాల్సిందే! ముఖ్యంగా సీతను ఒక పాత్రగా చూపించకుండా ప్రకృతిగా చూపించిన పద్ధతికి ప్రేక్షకులు ఉద్విగ్నులయ్యారు. ఊహకు అందని అరవిందన్ శైలికి జేజేలు పలికారు. రాళ్ళ నుండి రతనాలు ఏరటం లాంటి పని. మట్టి నుండి మాణిక్యాలు తీయటం లాంటి పని – అరవిందన్ అత్యద్భుతంగా చేశాడు. భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని అరణ్యాల అందాలు కాదక్కడ… దర్శకుడిగా అరవిందన్ హృదయ సౌందర్యాన్ని శ్లాఘించాలి!
అరవిందన్ ఉత్తరాయణం, కాంచన సీత, కుమ్ముటి, పొక్కువేయిల్, ఒరిదత్, చిదంబరం వంటి సినిమాలు, ఎస్తప్పన్, ఉన్ని, వాస్తుహార, థంపూ వంటి చిత్రాల ప్రదర్శనలు అనేకచోట్ల జరుగుతూనే ఉంటాయి. ఆయన సినిమాల మీద చర్చలు పత్రికలలో, సెమినార్‌లలో కొనసాగుతూనే ఉంటాయి. కానీ, బాధల్లా ఒకటే. కొత్తవేవీ రాకుండా పోయాయి కదా అని! ప్రవాహం ఆగిపోయిందన్న బాధ సృజనాత్మకత అనే ఒక విద్యుత్ అకస్మాత్తుగా ఆగిపోయిందన్న తల్లడింపు. యాభైఆరేళ్ళకే ప్రపంచ దర్శకుల స్థాయినందుకున్న ఈ సృజన శీలి మరి కొంత కాలం బతికి ఉంటే, మరిన్ని ‘మాస్టర్ పీసెస్’ భారతీయ చిత్రసీమకు అందేవి.
అరవిందన్ గూర్చి వినడం, చదవడం, ఆయన సినిమాలు చూసి క్షుణ్ణంగా జీర్ణించుకోవడం వేరు. ఆయనను కలుసుకోవడం వేరు. హైదరాబాదు సారధి స్టూడియోలో ఆయన సినిమా ‘ఒరిదత్’ ప్రదర్శించినప్పుడు ఆయన అక్కడికి వచ్చారు (1989). దేశంలోని గొప్ప సినీ దర్శకులలో తాను ఒకడినన్న అహంభావం గానీ గర్వంగానీ లేవు. ఎత్తయిన విగ్రహం, కానీ చాలా సిగ్గపడుతూ వినయంగా మాట్లాడాడు. ఆయన పత్రికల్లో నిర్వహించిన కార్టూన్ శీర్షిక ”చిన్న మనిషి – పెద్ద ప్రపంచం” ఆయన పట్ల అక్షరాలా నిజం! ”మీలోని పెద్ద ప్రపంచం మీ సినిమాల్లో ప్రతిఫలిస్తోంది. మేం ఇంకా ఆశిస్తున్నాం” అని ఇంగ్లీషులో నేను చెప్పినప్పుడు, చిన్న పిల్లాడిలా వంకర్లు తిరిగిపోయి ”థాంక్యూ ఫర్ ద ఎక్స్‌పెక్టేషన్స్” అంటూ సగానికి వంగి నాతో చేయికలిపాడు. ఆపూట మరో రకంగా కూడా అనిపించింది. నేనొక చిన్న మనిషినైతే – నేను కలిసిన పెద్ద ప్రపంచం – అరవిందన్ అని!!
– వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ విజేత, జీవశాస్త్రవేత్త.
– డాక్టర్ దేవరాజు మహారాజు