
నవతెలంగాణ – వేములవాడ
నియోజకవర్గ అన్ని రంగాలలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని వేములవాడ ఎమ్మెల్యే అన్నారు. వేములవాడ పట్టణంలోని బద్ది పోచమ్మ విధి ముదిరాజ్ సంఘ సభ్యులు శుక్రవారం చెక్కపల్లి రోడ్డులో గల పెద్దమ్మ దేవాలయం ఆవరణలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ విప్ పెద్దమ్మతల్లిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా అందుకు సహకరించిన ప్రభుత్వ విప్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ నన్ను ఆహ్వానించి నాకు ఆత్మీయంగా సన్మానం చేసిన బద్ది పోచమ్మ వీధి ముదిరాజ్ సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో నా గెలుపులో భాగస్వామ్యం అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజులకు చేసింది ఏమీ లేదన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారని అన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల పేద ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయంగా కులగణన చేపట్టడంతో పాటు 16 కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పుల్కం రాజు, శ్రీశైలం, పెండ్యాల తిరుపతి, అన్నారం శ్రీనివాస్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.