సాహిత్య రంగంపై అడిగోపుల ‘నిలువెత్తు సంతకం’

సాహిత్య రంగంపై అడిగోపుల 'నిలువెత్తు సంతకం'ప్రముఖ అభ్యుదయ కవి, రచయిత అడిగోపుల వెంకటరత్నం శుక్రవారం ఉదయం తిరుపతిలో కన్నుమూశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కొత్తవంగల్లు గ్రామంలో అడిగోపుల వెంకటయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు 1945 జులై 1న జన్మించారు. వత్తిరీత్యా సివిల్‌ ఇంజనీర్‌గా కొంతకాలం గుంటూరు జిల్లాలో, ఆ తరువాత తిరుపతిలో పనిచేశారు. ఐదు దశాబ్దాలకు పైగా సాహితీ సేద్యం చేస్తూ 27 కవితాసంపుటాలు, 1 కథాసంపుటిని ప్రచురించారు. మార్క్సిస్టు భావజాలంతో మంచికోసం, మానవీయత కోసం తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన అభ్యుదయ రచయిత, కవి అడిగోపుల వెంకటరత్నం. వీరికి భార్య పద్మజ, కుమార్తెలు మాధవి, శాంతి, కుమారుడు శ్రీకాంత్‌ ఉన్నారు.
‘సూర్యదయం’తో ప్రారంభమైన ఆయన సాహిత్య ప్రస్థానం సాహిత్యలోకంపై ‘నిలువెత్తు సంతకం’ చేసి వెళ్లిపోయింది. వీరి తొలి కవితా సంపుటి ‘సూర్యోదయం’కు ఆరుద్ర, రెండో కవితా సంపుటి ‘ఎన్నాళ్ళీ చరిత్ర’ కు ఆత్రేయ, ‘మరణానికి రెండు ముఖాలు’ కవితా సంపుటికి గుంటూరు శేషేంద్ర శర్మ వంటి ప్రముఖులు ముందుమాటలు రాశారు. చివరగా ఈ ఏడాది ‘నిలువెత్తు సంతకం’ కవితా సంపుటి వెలువరించారు. అడిగోపుల వారు రాసిన సూర్యోదయం (1984), ఎన్నాళ్ళీచరిత్ర (1985), జీవన పోరాటం (1986), బానిసత్వం అమ్మబడును (1987), మరణానికి రెండు ముఖాలు (1988), విప్లవానికి పురిటిగది (1990), అశ్రువీధిలో అగ్నిగానం (1991), యుద్ధమంటే మాకు భయంలేదు (1992), మట్టి మౌనం వహించదు (1994), మహాపథం (1996), రాతిచిగుళ్ళు (1998), అదశ్యకుడ్యం (2000), సంకెళ్ళు తెగిన చప్పుళ్ళు (2002), శ్వేతపత్రం (2004), విశ్వగీతం (2006), రంగుల చీకటి (2009), రేపటి వర్తమానం (2011), రెక్క విప్పిన రాగం (2013), రేపటి జ్ఞాపకం (2016), ముందడుగు (2017) పదండి ముందుకు (2019) , కాలం నా చేతిలో వుంది (కవితా సంపుటి) 2020, జయభేరి (కవితా సంపుటి) 2021, కొత్త గాలి (కవితా సంపుటి) 2022, నిలువెత్తు సంతకం (కవితా సంపుటి)2024.
వీరి కవితలు దేశంలోని 18 భాషల్లోకి, కథలు తమిళ, మళయాళ, కన్నడ భాషల్లోకి అనువాదం కాబడ్డాయి. 2008లో ‘సమకాలీన తెలుగు తీరుతెన్నులు’ అనే అంశంపై సిడ్నీలో ప్రసంగం చేశారు. 1991లో ‘పురోగతి అంచున’ కథా సంపుటికి నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి శ్రీశ్రీ స్మారక గోల్డ్‌ మెడల్‌ అందుకున్నారు. కుందుర్తి స్మారక అవార్డు, తానా అవార్డు, వాసిరెడ్డి – సుంకర అవార్డు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిష్ఠాకర ప్రతిభా పురస్కారం, 2014 లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు చే ”కవిరత్న” బిరుదు ప్రదానం. 2015లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం, కొలకలూరి భాగీరథీ కవితా పురస్కారం, ఫ్రీవెర్స్‌ ఫ్రంట్‌ పురస్కారం వంటి అనేక అవార్డులు అందుకున్నారు. వీరి రచనలపై ఇప్పటికీ నాగార్జున, వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. వీరికి తెలంగాణ సాహితి తరపున నివాళులు.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 91 88977 65417