పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆదికేశవ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విడుదల విశేషాలను షేర్ చేసుకోవడానికి మంగళవారం దర్శకుడు శ్రీకాంత్ ఎన్‌రెడ్డితో కలిసి నిర్మాత ఎస్.నాగవంశీ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ‘ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ వరల్డ్ కప్‌లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. భారత్ విజేతగా నిలుస్తుందనే అంచనాలున్నాయి. ఈ వరల్డ్ కప్ ప్రభావం సినిమాలపై పడుతుంది. ముఖ్యంగా భారత్ మ్యాచ్‌లు ఉన్న సమయంలో థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపించడంలేదు. అందుకే చిత్ర బందం, డిస్ట్రిబ్యూటర్స్ అందరితో చర్చించి ఈనెల10వ తేదీన విడుదల కావాల్సిన ‘ఆదికేశవ’ను ఈనెల 24వ తేదీన విడుదల చేస్తున్నాం. సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది’ అని తెలిపారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి కూడా ఈ చిత్రంపై ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేశారు.