
పరీక్షల పట్ల భయం లేకుండా ఒత్తిడికి గురికాకుండా పదవ తరగతి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్లో సోషల్ బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ప్రీమెట్రిక్ వసతి గృహ పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్టడీ, పరీక్షకు సంబంధించిన మెటిరియల్ ను కలెక్టర్ అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు పదో తరగతి చాలా ముఖ్యమని అన్నారు. పరీక్షల పట్ల భయం లేకుండా నిత్యం కష్టపడి పరీక్షల్లో మంచి మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు బోధనలు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు కూడా వారిలోని భయాన్ని తొలిగించుకోవాలని సూచించారు. గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్న పత్రాలను విశ్లేషించుకొని చదవాలన్నారు. ఇష్టంతో కష్టపడి చదివి ఉత్తీర్ణులవ్వాలన్నారు. ఎలాంటి సందేహాలున్న సబ్జెక్ట్ నిపుణులు నివృత్తి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ వెల్ఫర్ అధికారులు రాజలింగు, సునీత, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్, సబ్జెక్ట్ నిపుణులు కంటేశ్వర్, ప్రవీణ్, రమాకాంత్ రెడ్డి, విఠల్, సుశీల, మురళీధర్ పాల్గొన్నారు.