
పార్లమెంటులో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన ఆర్థిక బడ్జెట్ అటు తెలంగాణ రాష్ట్రానికి, ఇటు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి తీవ్ర అన్యాయాన్ని మిగిల్చిందని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంపై బిజెపి కేంద్ర ప్రభుత్వ చూపిస్తున్న పక్షపాతాన్ని నిరసిస్తూ సోమవారం పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన ర్యాలీగా బయలుదేరి అంబెడ్కర్ చౌక్ లో అంబెడ్కర్ విగ్రహానికి మెమోరాండం సమర్పించారు. మోడీ, బిజెపి లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కక్ష్యపూరిత వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయని అన్నారు. కేవలం కార్పోరేట్లు, బడా కాంట్రాక్టర్లు, ధనవంతుల ప్రయోజనాలకు లబ్ధి చేకూర్చే రంగాల్లో మాత్రం గణనీయమైన కేటాయింపులు చేసిందని, బీహార్, దిల్లీ, ఏపీ, గుజరాత్‌లకు మాత్రమే ఫ్రాధాన్యతనివ్వడం కక్ష సాధింపు కాదా అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు బీజేపీకి 4 గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీని ఇచ్చినా కూడా ఇక్కడి ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసిందని అన్నారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు. సీసీఐ ఫ్యాక్టరీ తెరిపించటం కానీ, విమానాశ్రయం ఏర్పాటు చేయటం కానీ ,రైల్వే అభివృద్ధికి ఎలాంటి కేటాయింపులు చేయలేదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, నవీన్ రెడ్డి, నరసింహ చారి, అనుముల ఉషన్న, జుబేదా, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పరమేశ్వర్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ రెడ్డి, అబిబ్, వసీం ఉన్నారు.