మనిషిలో వచ్చిన మంచి మార్పు ఎప్పటికీ ఉండాలని, నెల రోజులపాటు పాటించి వదిలివేయవద్దని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రతీ రోజూ ప్రతీ పాఠశాలలో, ఉదయం ప్రార్థన సమయంలో, సాయంత్రం వేళల్లో ఆరు సూత్రాలతో పాటు యోగా నిర్వహించాలని, అన్ని పాఠశాలలు ఆరోగ్య పాఠశాలలుగా తీర్చిదిద్దాలని అన్నారు. శనివారం ఆరోగ్య పాఠశాలపై కలెక్టర్ రాజర్షి షా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా విద్యార్ధుల్లో వచ్చిన మార్పులను 44 ప్రభుత్వ పాఠశాల నుండి వచ్చిన స్టూడెంట్ చాంపియన్ విద్యార్ధులు కలెక్టర్ కు వివరించారు. ఆరు సూత్రాల అమలు ప్రతి సోమవారం వ్యక్తిగత పరిశుభ్రత, మంగళవారం పోషకాహారం పై అవగాహన , బుధవారం ఒత్తిడి నివారించుకునే మార్గాలు, గురువారం డ్రగ్స్ కు దూరంగా ఉండడం, శుక్రవారం కాలానుగత వ్యాధుల నివారణ, శనివారం వ్యక్తిత్వ వికాసంతో పాటు మరికొన్ని ఆరోగ్య అంశాలను చేర్చి విద్యార్థులకు అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆరు సూత్రాల అమలులో విద్యార్థుల్లో చాలా మార్పులు వచ్చాయని, పొగాకు, గుట్కా తినడం మానివేశారని, జంక్ ఫుడ్ తీసుకోవడం లేదని, క్రమశిక్షణతో పాటు, అరోగ్య అలవాట్లను పాటిస్తూ, తల్లిదండ్రుల్లో మార్పులు తీసుకువచ్చామని విద్యార్ధులు తెలిపారు. ఇదే పద్ధతిలో ముందుకు వెళతామని అన్నారు. ఇప్పటి వరకు 133 పాఠశాలలను రివ్యూ చేయడం జరిగిందని. కలెక్టర్ తెలిపారు. అనంతరం స్టూడెంట్ చాంపియన్ విద్యార్ధులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి ప్రణీత, ఆయా పాఠశాలల నుండి ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు, స్టూడెంట్ చాంపియన్ లు పాల్గొన్నారు.