ఆదిలాబాద్‌ఏ 43.3 డిగ్రీలు

ఆదిలాబాద్‌ఏ 43.3 డిగ్రీలు– ఈ ఏడాది ఇదే అత్యధికం
– పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో గరిష్టంగా 43.3 డిగ్రీలు నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇదే అత్యధికం. వచ్చే ఐద్రోజులు కూడా రాష్ట్రంలో పొడివాతావరణం ఉంటుందనీ, వడగాల్పులు వీచే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో అన్ని జిల్లాలకూ వాతావరణ శాఖ ఆరెంజ్‌ హెచ్చరికను జారీ చేసింది. 14 జిల్లాల్లో 42 డిగ్రీలకుపై రికార్డయ్యాయి. హైదరాబాద్‌ పరిధిలో మూసాపేటలో అత్యధికంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్‌ ఒకటి, రెండో తేదీల్లో ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 10 గంటల వరకు మద్దుట్లలో అత్యధికంగా 66.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో 3.5, సూర్యాపేట జిల్లా అనంతగిరిలో 2.8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ. బయ్యారంలో 2.0 మిల్లీమీటర్ల చొప్పున వాన పడింది.

ఆదిలాబాద్‌ 43.3 డిగ్రీలు
నాంపల్లి(నల్లగొండ) 43.0 డిగ్రీలు
గద్వాల(జోగులాంబ గద్వాల) 42.8 డిగ్రీలు
అర్లి(టి)(ఆదిలాబాద్‌) 42.8 డిగ్రీలు
మాడ్గులపల్లి(నల్లగొండ) 42.7 డిగ్రీలు
దనోరా(కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌) 42.7 డిగ్రీలు
కేతిరెడ్డిపల్లి(రంగారెడ్డి) 42.7 డిగ్రీలు
కన్నాయిపల్లి(వనపర్తి) 42.6 డిగ్రీలు
తెల్దేవరపల్లి(నల్లగొండ) 42.6 డిగ్రీలు
మేడ్లవాయి(నల్లగొండ) 42.6 డిగ్రీలు