బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‌లో రూపొందిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’. 1991లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా అప్పట్లోనే ఇదొక ప్రయోగాత్మక చిత్రంగా అందరి ప్రశంసల్ని సొంతం చేసుకుంది. ఈ ఐకానిక్ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు బాలకృష్ణ ఓ శుభవార్త చెప్పారు. ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ని తెరకెక్కించబోతున్నారు. తన తనయుడు మోక్షజ్ఞ కథానాయకుడిగా నటిస్తారని బాలకృష్ణ తెలిపారు. అన్‌స్టాపబుల్ (సీజన్ 4) ఆరవ ఎపిసోడ్ ఈనెల 6వ తేదీన టెలికాస్ట్ కానున్న సందర్భంగా బాలకష్ణ ఈ సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు. ఈ ఎపిసోడ్‌లో బాలకష్ణ ‘ఆదిత్య 369’ అవతార్‌లో కనిపించి, సీక్వెల్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించడంతో పాటు ‘ఆదిత్య 999 మ్యాక్స్’ మేకింగ్‌కి సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. నవీన్ పోలిశెట్టి, శ్రీలీల వంటి అతిథులతో బాలకృష్ణ చేసిన ఈ ఎపిసోడ్ ఆహాలో ప్రసారం కానుంది. టైమ్ మిషన్, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ‘ఆదిత్య 369’ తెరకెక్కింది. బాలకృష్ణ, మోహిని జంటగా నటించారు. కథానాయకుడు భూతకాలం, భవిష్యత్‌లోకి ప్రయాణిస్తే అతనికి ఎలాంటి పరిస్థితులు, పరిణామాలు ఎదురయ్యాయన్న కాన్సెప్ట్‌తో దీన్ని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. బాలకృష్ణ సినీ ప్రస్థానంలో ఓ మైలురాయిగా నిలిచింది. ఇదిలా ఉంటే, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాతో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు.