అంబరాన్నంటిన ఆదివాసుల సంబరాలు

 Adivasi celebrations like Ambaran– జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ
– ఘనంగా 30వ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆదివాసి భవన్‌లో రాంజీ గోండు పంచాయతీ రాయి సెంటర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన 30వ ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లాలోని అన్ని మండలాల నుంచి జిల్లా కేంద్రానికి ఆదివాసులు పెద్ద ఎత్తున తరలిరాగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి విజయవంతం చేశారు. డోలు, డప్పు, వాయిద్యాలు ఆదివాసీ నృత్యాలతో ర్యాలీగా బయలుదేరిన ఆదివాసీలు కొమరం ీమ్‌ చౌక్‌ వద్ద జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, జిల్లా ఎస్పీ డీవి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, పాల్వాయి హరీష్‌ బాబు, డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్‌, డీటీడీఓ రమాదేవి, డీపీఆర్‌ఓ సంపత్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్‌, డీఎస్పీ సదయ్య, ఆదివాసీ సంఘాల జాతీయ నాయకుడు అర్జులతో కలిసి కుమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆదివాసి భవన్‌ వద్ద జండాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆదివాసీ జాతులలో వారి హక్కుల కోసం పోరాడిన వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి త్యాగాలకు గుర్తుగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
సంస్కతి సాంప్రదాయాలు కాపాడుకోవాలి
ఆదివాసుల సంస్కృతి ఎంతో గొప్పదని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. ఆదివాసులు ప్రకృతికి దగ్గరగా ఉన్నందున మిగతా వారితో పోలిస్తే వారి జీవితకాలం కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. ఇది దేవుడు వారికి ఇచ్చిన వరమని కొనియాడారు. ఇదే సందర్భంలో విద్యారంగంలో వారు మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. జిల్లాలోని ఆదివాసి ప్రాంతాల్లో విద్య, వైద్య, రవాణా రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. విద్యాభివృద్ధికి అమ్మ ఆదర్శ పాఠశాల పథకాన్ని ఉపయోగిస్తున్నట్లు, వైద్య అభివృద్ధి కూడా ప్రత్యేక పథకాల అమలు చేస్తున్నామన్నారు. రవాణా అభివృద్ధికి కావలసిన అటవీ అనుమతుల కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు. ఆదివాసీ యువత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడానికి నిరంతరం కృషి చేయాలన్నారు. సాధారణ విద్యతో పాటు ఐఐటీ లాంటి వాటిపై కూడా దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెరమెరి మాజీ జడ్పీటీసీ దృపదాబాయి, రెబ్బెన మాజీ ఎంపీపీ సౌందర్య, వివిధ సంఘాల నాయకులు బుర్సపోయ్య, రేగుంట కేశవ్‌ పాల్గొన్నారు.
చింతలమానేపల్లి : మండల కేంద్రంలో ఆదివాసీ కొలవార్‌ సేవ సంఘం మండల అధ్యక్షుడు బూర్రి నీలయ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కుమురంభీం విగ్రహం నుంచి బస్టాండ్‌ వరకు సంప్రదాయ వాయిధ్యాలతో నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి, ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదాలతో హోరెత్తించారు. మండల కేంద్రంలోనీ కుమురంభీం, అంబేద్కర్‌, చత్రపతి శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్‌ సమీపంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా జెండాను ఎగరవేశారు. పోలీస్‌ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తూ, ఏఎస్‌ఐ యాదవ్‌ కొమురం భీం చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ మేకల ప్రసాద్‌, రాజయ్య, కొలవార్‌ సేవ సంఘ నాయకులు గాట్లె శంకర్‌, ఫణిందర్‌, ఆదివాసి మహిళలు, యువకులు పాల్గొన్నారు.
పెంచికల్‌పేట్‌ : మండలంలోని మురళిగూడ గ్రామపంచాయతీలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ ముద్దుబిడ్డ కుమురంభీం విగ్రహాన్ని పెంచికలపేట ఎస్సై కొమురయ్య, ఆదివాసీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మండలంలోని గ్రామాల్లో ఆదివాసీ జెండాలను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు తలండి మధుకర్‌, ఆలం సకారం, సిడం అశోక్‌, భుజంగరావు, గురుదాస్‌, లక్ష్మయ్య పాల్గొన్నారు.
తిర్యాణి : మండలంలోని రొంపల్లి గ్రామ పంచాయతీలో గల మోకాసిగూడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసులు జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో పంద్రం దౌలత్‌ రావు, సిడాం కృష్ణారావు, జై నేని శంకర్‌, రొడ్డ భీమయ్య, గేడం లింగు, సిడాం గోపాల్‌, బాపు, సోను, ధస్వంత్‌ రావు పాల్గొన్నారు.
కౌటాల : ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు శుక్రవారం అట్ట హసంగా నిర్వహించారు. ఆదివాసీ గిరిజనులు పెద్ద సంఖ్యలో ర్యాలీలు నిర్వహించారు. సంప్రదాయ వాయిద్యాలతో ఉత్సహంగా పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఐక్యంగా ఉండాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. మండలంలో ర్యాలీ నిర్వహించారు. డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ కొమురం మాంతయ్య, మన్నెవార్‌ కొలవార్‌ సేవ సంఘం బాధ్యులు మెర్పల్లి బ్రహ్మయ్య, సదాశివ పాల్గొన్నారు.
దహెగాం : మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాపీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు దిగిడే బక్కన్న జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం మండల నాయకులు పాల్గొన్నారు.
వాంకిడి : మండల కేంద్రంలో సవాతి క్రాస్‌ రోడ్డు వద్ద ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో భాగంగా కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసులందరూ ఐక్యంగా ఉండాలని, ప్రభుత్వం ఆదివాసులను అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐటీడీఏ డైరెక్టర్‌ సిడాం భీంరావు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.