కనకరాజు మరణం పట్ల ఆదివాసీ గిరిజన సంఘం సంతాపం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పద్మ శ్రీ అవార్డు గ్రహీత కనకరాజు మృతి ఆదివాసీ సమాజానికి తీరని లోటని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన మృతికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిడియం బాబూరావు, పూసం సచిన్‌ సంతాపాన్ని ప్రకటించారు.ఆదివాసీ సంస్కృతిని కాపాడేందుకు కనకరాజు విశేష కృషి చేశారని తెలిపారు. గిరి జనులకు వారు అందించిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు. గుస్సాడి బృందంతో ప్రపంచ వేదికలపై ఆదివాసీ సంస్కృతి విశిష్టతను చాటారని తెలిపారు. ఆసిఫాబాద్‌ కుమరం భీం జిల్లా జైనూర్‌ మండలం మార్లవాయి గ్రామంలో పుట్టిన ఆయన ఆదివాసీ సమాజ పురాతన సంస్కృతి గుస్సాడిని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప సాంస్కృతిక పరిరక్షకుడని తెలిపారు. ఆయన కుటుంబానికి వారు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.