ఆదివాసులు నేడు ప్రధానంగా రెండు ప్రమాదకరమైన విధ్వంసాలను ఎదుర్కొంటున్నారు. 1. భౌతిక విధ్వంసం, 2. భావపరమైన సాంస్కృతిక విధ్వంసం. ఈ రెండు విధ్వంసాల మధ్య ఆదివాసుల స్థితి అడకత్తెరలో పోకచక్కలా నలిగిపోతున్నది.
కార్పొరేట్ శక్తుల ఫైనాన్స్ (ద్రవ్య) పెట్టుబడి ప్రపంచ వ్యాప్తంగా ఎల్లలు లేకుండా ప్రవహిస్తూ, ఆయా దేశాల ప్రాకృతిక సహజ వనరులపై పడగ విప్పుతున్నది. గతంలో సామ్రాజ్యవాదం అటవీ ఉత్పత్తులపైనే (కలప, సుగంధ ద్రవ్యాలు మొ||) కన్ను వేసేది. ఇప్పుడలా కాదు. అటవీ భూభాగం లోపలనున్న బొగ్గు, చమురు, యురేనియం, బాక్సైట్, బంగారం గనులు… ఇలా అన్నింటినీ యధేశ్చగా కొల్లగొట్టేందుకు ఆర్థిక రహదారులను పరుచుకుంటున్నది. పాలకులు అందుకు వంత పాడటం మరో పెద్ద విషాదం. ఫలితంగా ఆదివాసులు పెద్ద ఎత్తున విస్తాపనకు గురవటం తెలిసిందే. అలాగే అభివృద్ధి పేరిట బహుళార్ధక సాధక ప్రాజెక్టుల నిర్మాణం వలన కూడా మన ఆదివాసులు గట్టున పడ్డ చేపల్లా విలవిలా కొట్టుకోవడం కూడా తెలిసిందే.
‘అభివృద్ధి’ అంటే లక్షల కోట్ల ప్రజానీకం బతుకు తెరువును దెబ్బతీయడం కాదు. మానవ హక్కులను మృగ్యం చేయడం కాదు. తరతరాలుగా అనుభవించే ఆవాస స్థలాలను, అనుభవించే ప్రకృతి సహజ వసతులను చిందర వందర చేయడం కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా కుటుంబ, మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేసి అభద్రతకు గురిచేయడం కాదు.
మన భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన జీవన హక్కులు కల్పించింది. ఏ వ్యక్తి కూడా తాను రెండవ తరగతి పౌరునిగా గుర్తించబడుతున్నాననే అభద్రతా భావనకు రాకూడదు. అయితే పాలకులు అనుసరించే కార్పొరేట్ విధానాల ఫలితంగా ఆదివాసులకు ఈ ప్రమాదం ముంచుకొచ్చింది.
ఆదివాసులు తరతరాలుగా కొనసాగించే జీవన విధానాన్ని ఆటంకపరచకూడదని, తమ సొంత సంప్రదాయ కళలు, సంస్కృతి అభివృద్ధి పరుచుకోవడంలో అవకాశాలు కల్పించాలని, నిర్వాసితులను ఆ ప్రాంత ‘అభివృద్ధి’ ఫలాలు అందుకునేలా వారిని (ఆదివాసులను) భాగస్వాములు చేయాలని, ఉపాధి పనులు వారికి దక్కేలా తొలి ప్రాధాన్యతనీయాలని, అసలు పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ఉండాలనీ, స్థావరం మారినా వారి సామూహిక జీవనం కొనసాగేలా చర్యలు గైకొనాలనీ… ఇలా ఎన్నెన్నో తీపి తీపి మాటలతో పునరావాస లక్ష్యాలను ఏర్పరచుకున్నా, అవన్నీ ఆచరణలో వట్టి గాలి మాటలుగానే తేలిపోయాయి.
అందుకనే దీనిని గతి తప్పిన అభివృద్ధి క్రమంగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం 2004లో ప్రాజెక్టుల ప్రభావిత కుటుంబాలకై ఒక జాతీయ పునరావాస విధానాన్ని రూపొందించుకున్నప్పటికీ, అమలుకు అడ్డుగా నిలుస్తున్నది. అంతులేని అవినీతి అని వేరుగా చెప్పక్కర్లేదు. అంటే అవినీతి బాధితులే ఈ ఆదివాసి నిర్వాసితులు అని మనం గ్రహించవచ్చు. కాగా ఇప్పుడొక వితండవాదం బయలుదేరింది. ‘చెరువులో నీళ్లు ఎందుకు ఎండిపోయాయి? అంటే చేపలు తాగేశాయండి’ అని చెప్పినట్టు అడవుల తరుగుదలకు ఆదివాసులే కారణం అనే అసంబద్ద వాదనకు తెరతీశారు. ఈ నెపంతో ఆదివాసుల పోడు వ్యవసాయంపై, సాగు భూములపై ఆంక్షలు విధిస్తున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్‌వారితో పోరాడినట్టు, ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఫారెస్ట్ గార్డులతో ఆదివాసులు తలపడాల్సి వస్తున్నది.
ఏడాదికి సగటున లక్షన్నర ఎకరాల అడవులు నశిస్తున్నాయనేది ఒక అంచనా. ఇలాగే కొనసాగితే భూ ఉద్గారాలు పెరిగి 2100 నాటికి జీవకోటి మనుగడే కనాకష్టం అవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
2. కార్పొరేట్ మార్కెట్ సంస్కృతి మాయాజాలంలో ఆదివాసులు శరవేగంగా చిక్కుకుపోతున్నారు. అవే ‘అభివృద్ధి’ చదువులు అన్న మిషతో సహజంగా ప్రకృతిసిద్దంగా లభించే జ్ఞానాన్ని తృణీకరిస్తున్నారు. తమకు తెలియకుండానే పరాయీకరణకు (ఎలియనేట్) గురవుతున్నారు. తమ తల్లిదండ్రులు చేసే సేద్యం పనుల వివరాలు, అటవీ ఉత్పత్తుల సేకరణ, పని పద్ధతుల గురించి చెప్పలేకున్నారు. నానాటికి వాటినుండి దూరమైపోతున్నారు. అసలే చదువుకు దూరంగా (రాసిలోనూ, వాసిలోనూ) ఉండే ఆదివాసి పిల్లలపై ఈ విపత్తు పులిమీద పుట్రలా స్వారీ చేస్తున్నది.
పర్యావరణ వింతలు చూసేందుకు టూరిస్టు కేంద్రాలు తామరతంపరలా వెలుస్తున్నాయి. పర్యాటకుల్లో చాలామందికి కనీస ఇంగితజ్ఞానం కొరవడి ఆ ప్రాంతాలన్నీ ప్లాస్టిక్‌మయం చేస్తున్నారు. మద్యం సీసాలు, తిని పారేసే ఫుడ్ ప్యాకెట్లు, సిగరెట్ పీకలతో నింపుతున్నారు. వాహనాల రణగొణధ్వనులు, డి.జె.సౌండ్ సిస్టమ్స్‌తో విపరీతమైన శబ్దకాలుష్యం చేస్తున్నారు.
ఆరోగ్యానికి హానికల్గించే జంక్‌ఫుడ్‌లను, కూల్‌డ్రింక్స్‌ను, కుర్‌కురేలను విచ్చలవిడిగా వాడుతున్నారు. పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టు ఆదివాసులు కూడా ఈ అలవాట్లకు బానిసలైపోతున్నారు. తగరంతో నిల్వవుంచిన ఆహార పదార్థాల్లో క్యాన్సర్ కారకాలు, కూల్‌డ్రింక్స్‌లో క్రిమిసంహార మందుల అవశేషాలు వున్న విషయం తెలిసిందే. అయినా ఈ విషతుల్య పదార్థాలు, ఎరువుల రసాయనాలు, ప్లాస్టిక్‌ను నియంత్రించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి.
అయితే వాటికి ముందుగా బలైపోతున్నది ఆదివాసిపిల్లలే. పౌష్టికాహార లోపంతో, సంక్రమిత వ్యాధులతో ప్రతి రోజు సగటున మూడు వేలమంది బాలలు మన దేశంలో మృత్యువాత పడుతున్నారు. వీరిలో ఎక్కుమంది ఆదివాసి బాలలని తెలుసుకోవాలి.
కాగా, ఆదివాసి యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కొందరు యువకులు అక్రమ గంజాయి సాగు, రవాణాకు చేరువవుతున్నారు. మద్యం, గుట్కా, డ్రగ్స్ వాడకం సరేసరి. ఆన్‌లైన్ ఫోన్‌లో వచ్చే బూతు (ఫోర్న్) చిత్రాల ప్రభావంతో కిశోర వయసుకు ముందే లైంగిక విశృంఖల చేష్టలకు దిగజారుతున్నారు.
సహజత్వానికి, అమాయకత్వానికి, నిర్మలత్వానికి, నిష్కళంకితకు ప్రతీకగా నిలిచే ఆదివాసి సంస్కృతికి ఎంతటి విఘాతం కలుగుతున్నదో కళ్లారా చూస్తున్నాం. ఒక్కరి కోసం అందరు, అందరి కోసం ఒక్కరు నిలబడే కట్టుబాట్ల సమిష్టి సంస్కృతి బీటలు వారుతున్నది. ఏవి సరైన విలువలో, వేటిని పాటించాలో, వేటిని కాపాడుకోవాలో, వేటిని తిరస్కరించాలో తెలుసుకోలేకపోతున్నారు.
ఈ నేపధ్యంలో ఆదివాసి (మూలవాసి) సంస్కృతిని ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత ప్రపంచం ముందుకొచ్చింది. ఆదివాసి రక్షణ అంటే అడవుల రక్షణ. అడవుల రక్షణ అంటే పర్యావరణ రక్షణ. పర్యావరణ రక్షణ అంటే ఈ భూగోళ రక్షణ.
అయితే ఈ రక్షణ పోరాటం ఆదివాసులపై ద్విముఖ కర్తవ్యాన్ని ఉంచింది.
‘అభివృద్ధి’ పధంలో ఉన్నత చదువులకు ఉన్నత ఉద్యోగాలకు ఆదివాసులు వెళ్లవద్దని, వెళ్లకూడదని ఎవ్వరూ చెప్పరు. అదే సందర్భంలో ఆదివాసులు తమకు పారంపర్యంగా లభించే ప్రకృతి జ్ఞానాన్ని (తమకే సొంతం గనుక) సాద్యమైనంతగా పరిరక్షించడం, నమోదు చేయడం, తర్వాతి తరాలకు అందించడం ఓ గురుతర బాధ్యతగా ముందుకొచ్చింది. ఇది ఓ చారిత్రక కర్తవ్యం. అందుకు ప్రగతిశీల శక్తుల సహకారం స్వీకరించడం, ఆదివాసేతర సమాజం కూడా తోడుకావడం తప్పనిసరి అయింది. ఎక్కడికక్కడ ఈ కృషి అంతర్గతంగా ఎంతగా అభివృద్ధి చెందితే అంతగా మానవసమాజం నూత్న ఉత్సాహంతో కొత్త పరవళ్లు తొక్కుతుంది.
అలాగే కార్పొరేట్ భౌతిక విధ్వంసక అభివృద్ధికి వ్యతిరేకంగా రైతులు, కార్మికులు సకల మానవాళి సాగించే సమైక్య పోరాటాల్లో ఆదివాసులూ భాగస్వామ్యం కావాలి. అంతే సమాంతరంగా ఆదివాసుల పోరాటం కేవలం ఆదివాసులది మాత్రమే కాదని, యావత్ సమాజానిది అని అందరం గుర్తెరగాలి.
– కె.శాంతారావు, 9959745723