ఇండియాలో రాజస్థాన్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక ఆదివాసీ జనాభా కేంద్రీకరించబడి ఉన్నది. సాధారణ సమాజానికి దూరంగా అణచి వేయబడిన గిరి పుత్రులకు మానవ హక్కులే తెలియవు. ఇలాంటి ఆదివాసీ జాతులు పోడు భూముల సాగుతో పాటు అటవీ ఉత్పత్తులనే జీవనోపాధులుగా చేసుకొని బతుకుతున్నారు.
స్వయంకృషిని మాత్రమే నమ్ముకొని, సాధారణ నాగరిక సమాజానికి దూరంగా జీవనయానం సాగించే ఆదివాసీ, స్వదేశీ జనజాతులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 దేశాల్లో కోట్లలో ఉన్నారు. ఇలాంటి ఆదివాసీ గిరిజన మన్యం జాతులు జనజీవన స్రవంతికి దూరంగా అడవుల్లో, ద్వీపాల్లో తమదైన ప్రత్యేక జీవనశైలితో తమదైన సంస్కతి వారసత్వాల సంపదలతో అమాయకంగా, అనాగరిక బతుకులను అనుభవిస్తున్నారు. నేటి డిజిటల్ యుగపు శాస్త్రసాంకేతిక ఫలాలు వీరి దరికి నేటికీ చేరలేదనేది చేదు వాస్తవం. ప్రపం చంలో తొలిసారి నీగ్రో నల్లజాతి ఆఫ్రికన్లను బానిసలుగా చేసుకొని అమెరికన్లు, బ్రిటీషర్లు అమానవీయంగా, పశువుల వలె వాడుకున్న చరిత్రను విన్నాం, కన్నాం. అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలు, భాషలు, వేషధారణలు, కులమతాలు, సాంప్రదాయాలతో మమేకమవుతూ, ఆధునిక హంగులకు దూరంగా, ప్రభుత్వ సహాయం అందని, మానవ హక్కులు తెలియని, చిన్న చిన్న మైనారిటీ సమూహాలుగా జీవిస్తుం టారు. నేటికీ ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో 5,000లకు పైగా ఆదివాసీ ప్రాంతాల్లో 60 కోట్ల ఆదివాసీలు ( ప్రపంచ జనాభాలో 6.2 శాతం) 2680 ఆదివాసీ భాషలతో ప్రత్యేక జీవన విధానంతో బతుకుతున్నారని అంచనా. అడవి పుత్రులుగా నేల, ప్రకతి వనరులు, జీవ సంపదపై ఆధారపడే వత్తుల్లో మగ్గుతూ దీనస్థితులలో బతుకులు సాగిస్తున్నారు.
2007లో ఐరాస తీసుకున్న తీర్మానం ప్రకారం ఆదివాసీ జాతుల మానవ హక్కుల పరిరక్షించ బడాలని, వారికి అభివద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశ్యంతో (1982 ఆగష్టు 09న నిర్వహించిన తొలి ఆదివాసీ జనుల సమావేశానికి గుర్తుగా) ప్రతి ఏటా ‘ప్రపంచ ఆదివాసీల అంతర్జాతీయ దినం (ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది వరల్డ్స్ ఇండిజీనియస్ పీపుల్)’ పాటించుట ఆనవాయితీగా వస్తోంది. స్వదేశీ జాతులకు ఉద్యోగ, ఉపాధి, విద్య, ఆరోగ్యం, సంస్కతి సాంప్రదాయాల పరిరక్షణ, గుర్తిం పులను అందించాలనే ప్రయత్నాలు నేడు జరుగుతున్నాయి. వలస రాజ్య పాలనతో ఆదివాసీలు అమానవీయ బానిసలుగా భావింపబడ్డారు. ఆదివాసీ జాతులు అనారోగ్యం, పేదరికం, వివక్షలతో అమానవీయ దుర్భర బతుకులను ఈడ్చుతున్నారు. ప్రపంచ ఆదివాసీల అంతర్జాతీయ దినం-2023 నినాదంగా ‘స్వయం అభివద్ధి ప్రతినిధులుగా ఆదివాసీ యువత’ అనే అంశాన్ని తీసు కున్నారు. ఐరాస 2005-15 దశాబ్దాన్ని ‘అంతర్జాతీయ ఆదివాసీ దశాబ్దం’గా పాటించడం మనకు తెలుసు. ఆదివాసీల్లో 86 శాతం అసంఘటిత, అనధికార ఆర్థిక వ్యవస్థలో కడు పేదరిక ఉచ్చులో చిక్కి ఉన్నారు. ప్రపంచ ఆదివాసీల్లో 47 శాతం అవిద్య, పేదరికం అనబడే జబ్బులతో నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు.
ప్రపంచ జనాభాలో 2వ స్థానం, వైశాల్యంలో 7వ స్థానం పొందిన అతి పెద్ద ప్రజాస్వామిక భారత దేశంలో 705 ఆదివాసీ సమూహాలుగా 10.4 కోట్ల జనులు (జనాభాలో 8.6 శాతం) ఉన్నారు. ఆదివాసులను యస్‌టిలుగా వర్గీకరించిన ప్రభుత్వం అనేక ఆర్థిక సామాజిక సహాయాలను అందిస్తున్నది. ఇండియాలో రాజస్థాన్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక ఆదివాసీ జనాభా కేంద్రీకరించబడి ఉన్నది. సాధారణ సమాజానికి దూరంగా అణచి వేయబడిన గిరి పుత్రులకు మానవ హక్కులే తెలియవు. ఇలాంటి ఆదివాసీ జాతులు పోడు భూముల సాగుతో పాటు అటవీ ఉత్పత్తులనే జీవనోపాధులుగా చేసుకొని బతుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ముఖ్యమైన ఆదివాసీ తెగలు ఉన్నాయి. వీరిలో చెంచు, బోడో/గుటోబ గడబ, కొంద్, కోలమ్, కొండ రెడ్డి, కొండ సవర, పొరోజ, కోయ, తోటి, కమ్మర, జటపస్, కట్టునాయకన్, కొలావర్, మన్న దొర, లంబాడీ, యానాది, నక్కల, వాల్మీకి, బంజార, సుగాలీ, గుస్సాడి లాంటి అటవీ జాతులు వస్తాయి. తెలుగు రాష్ట్రాల ఆదివాసీలు అటవీ ప్రాంతాల్లో పోడు భూముల్లో వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సమీకరణల మీద ఆధారపడి జీవనోపాధిని పొందుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతాల్లో పోడు సాగు చేస్తూ చెంచు జాతులు బతుకుదెరువు పొందుతున్నారు. ఆదివాసీలు విలక్షణమైన అటవీ పుత్రులు. అమాయక గిరిపుత్రులు జనజీవన స్రవంతికి దూరంగా, అమానవీయ పరిసరాల్లో అడవితల్లిని నమ్ముకొని అనాగరికంగా, అమాయకంగా బతుకు తుంటారు. అడవిలో కొంత భాగాన్ని కాల్చి వేసి వ్యవసాయ భూమిగా మార్చుకొని, హరిత సంపదను తొలగిస్తూ, కొద్ది ఏండ్లు పంటలు పండించుకుంటారు. దీనినే పోడు సాగు పద్దతిగా పిలుస్తాం. పోడు వ్యవసాయం పేరుతో ప్రతి ఏట అడవులు నరకడం జరుగుతున్నదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోనే వలసలు వెళుతూ, అటవీ సంపదను నరికి ‘వలస సాగు’ చేయడమే ఆదిలాబాద్?, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం లాంటి జిల్లాలకు చెందిన ఆదివాసీలకు జీవనారాధం అవుతున్నది. బతుకుదెరువుకు, పర్యావరణ పరిరక్షణకు మధ్య నిత్య పోరు చూస్తున్నాం. ఆదివాసీల పక్షాన నిలుస్తున్న ఓటు బ్యాంకు రాజకీయ వ్యవస్థలు దీర్ఘకాలిక అనర్థాలను అర్థం చేసుకోక పోవడం విచారకరం.
(09 ఆగష్టు ‘ప్రపంచ ఆదివాసీల అంతర్జాతీయ దినం’) – డా: బుర్ర మధుసూదన్ రెడ్డి , 9949700037