మణిపూర్‌లో ఆదివాసీలు, మైనార్టీలపై దమనకాండ ఆపాలి

– శాంతిని నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలి
– సోయం బాపూరావు వ్యాఖ్యలు సరికావు
– తెలంగాణలో బీజేపీ మెజారిటీయన్‌ సిద్ధాంతాన్ని తిప్పికొడతాం : ప్రజా సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో నాయకులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మణిపూర్‌లో ఆదివాసీ గిరిజనులు, మైనార్టీలపై మతోన్మాదుల దమనకాండను ఆపాలని పలువురు నాయకులు డిమాండ్‌ చేశారు. మణిపూర్‌ రాష్ట్రంలో ఆదివాసీలు, మైనార్టీలపై జరుగుతున్న దాడులు, హత్యలను ఆపాలనీ, శాంతిని నెలకొల్పాలనే డిమాండ్‌తో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, ఆవాజ్‌, తెలంగాణ గిరిజన సంఘం సంయుక్తాధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్‌ అధ్యక్షత వహించారు. మణిపూర్‌ బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేసి శాంతి నెలకొల్పాలని వారు డిమాండ్‌ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ మూల సిద్ధాంతమే మెజారిటియన్‌ సిద్ధాంతమనీ, అందులో భాగంగానే మణిపూర్‌లో హింసను ప్రేరేపించిందని విమర్శించారు. మెజారిటీల ఓట్లు దండుకునేందుకు మైనార్టీల పైకి ఉసిగొల్పడం, రాజకీయ లబ్ది పొందేందుకే బీజేపీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నదని తెలిపారు. ఎన్నికల కోసం మతాన్ని ఉపయోగించుకునే బీజేపీ విధానం మణిపూర్‌తో ఆగిపోదనీ, తెలంగాణలోనూ దాని వల్ల ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎంపీ సోయం బాపూరావు 12 మంది పాస్టర్లను బుల్లెట్లు దింపి చంపుతానని ప్రకటించడాన్ని వారు ఖండించారు. రాష్ట్రంలో ఆ పార్టీ మతచిచ్చు పెట్టేందుకు చేస్తున్న కుట్రలను ఆదిలోనే తిప్పికొట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్‌. శ్రీరాంనాయక్‌ మాట్లాడుతూ ఆదివాసీలకు స్వయంప్రతిపత్తి, అతివాదులతో చర్చలంటూ మొదటిసారి మణిపూర్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీ మాటమార్చిందని విమర్శిం చారు. హిందూ బ్రాహ్మణులతో సమానంగా ఉండే రాష్ట్రంలో 54 శాతంగా ఉన్నమెయితీలను ఎస్టీ జాబితాలో చేరుస్తామంటూ రెచ్చగొట్టి ఆదివాసీలపైకి ఉసిగొల్పిం దన్నారు. రాష్ట్రంలో దాదాపు 113 మంది హత్యలు, కాల్పుల్లో మరణించారనీ, 200 చర్చీలను కూల్చేశారనీ, గృహదహనాలు, లూటీలు జరిగాయని తెలిపారు. గిరిజనుల భూములను గిరిజనేతరులకు కట్టబెట్టేందుకు బీజేపీ తెగబడిందని విమర్శించారు.
ఆవాజ్‌ ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ అబ్బాస్‌ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌ ప్రకారం ఎస్టీ జాబితాలో చేర్చేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో అక్కడి బీసీలను ఎస్టీలో చేర్చేందుకు మణిపూర్‌ భూసంస్కరణల చట్టాన్ని ధ్వంసం చేసేలా బీజేపీ కుట్ర చేసిందని విమర్శించారు. అక్కడి ముఖ్యమంత్రి ఆదివాసీలపై కాల్పులు జరిపించి ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతమార్పిడి పేరుతో బీజేపీ ఆదివాసీలు, ఆదివాసీ యేతరుల మధ్య చిచ్చు పెడుతున్నదన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నా…. ఉద్దేశపూర్వకంగా హింసను ఆపలేదని ఆరోపించారు.
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌ బాబు మాట్లాడుతూ మణిపూర్‌ రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉండి హింసను ఎందుకు నిలువరించలేదని? ప్రశ్నించారు. మారణహౌం, హింసాకాండ ఎంత పెరిగితే అంత లాభమని బీజేపీ భావిస్తున్నదని విమర్శించారు. ప్రధానమంత్రి ఎందుకు నోరు విప్పడం లేదు? అని ప్రశ్నించారు. ప్రదేశ్‌ ఎరుకల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి రఘు మాట్లాడుతూ మైనా ర్టీలపై మతోన్మాద దాడులను తిప్పికొట్టేందుకు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్‌ పోరాటంలో భాగస్వాములుగా ఉంటామని తెలిపారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ నాయక్‌ మాట్లాడుతూ వారం రోజుల పాటు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూడావత్‌ ధర్మానాయక్‌ మాట్లాడుతూ హిందూ రాజ్యస్థాపనలో భాగంగా దాడుల్ని పెంచుతున్న బీజేపీని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఆల్‌ ఇండియా క్రిస్టియన్‌ ఫెడరేషన్‌ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గద్దపాటి విజయరాజు మాట్లాడుతూ క్రైస్తవుల య్యారనే కక్షతోనే దాడులు చేయిస్తున్నారని విమ ర్శించారు. మతోన్మాదులకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరి రక్షణకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ఆదివాసీలు హిందువులు కారు…
ఆదివాసీలు హిందువులు కారని రచయిత పులిగుజ్జు సురేష్‌ తెలిపారు. అలాంటప్పుడు హిందువుల నుంచి క్రైస్తవులుగా మతమార్పిడి చేశారంటూ బీజేపీ ఎంపీ సోయంబాపూరావు చేసిన విమర్శల్లో హేతుబద్ధత లేదని కొట్టిపారేశారు. ఆదివాసీలు అనుసరించే దానికి, హిందువులు అనుసరించేవి వేరని తెలిపారు. మణిపూర్‌లో ఆదివాసీల ప్రత్యేక పాలనకు అనుమతించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే అక్కడ హత్యలు ఆగే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వందలాది పార్ధీవదేహాలకు మార్చురీలు సరిపోనంత భయానకంగా మణిపూర్‌ మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 124 గ్రామాల నుంచి ఆదివాసీలను తరిమేశారనీ, పారిపోయిన వారంతా బతికున్నారో? లేదో? కూడా తెలియ దని చెప్పారు. ఆత్మరక్షణ కోసం కుకీ తెగకు ఇచ్చిన ఆయుధాలను వెనక్కి తీసుకుని, మెయి తీలకు ఆర్మీ ఆయుధాలను ఇచ్చి దాడులు చేయించారని విమర్శించారు. ఈ సమావేశంలో తెలంగాణ గిరిజన సంఘం హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఎం.బాలునాయక్‌, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఆర్‌.పాండు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.