విశేషణం చితికిపోయింది

విశేషణం చితికిపోయిందిఅప్పుడే అంకురించిన ఓ పసి మొక్కను గాంచి
అటుగా అరుదెంచిన అరవై దాటిన అక్షరజ్ఞుడొకడు
అందంగా అందరికీ అందేలా అన్నాడు
‘ఓహో! నువ్వు మహాద్భుత వృక్షానివి’ అని!

అంతే! స్వస్వరూపాన్ని మరిచి మొక్క
అతని మాంత్రిక ప్రశంసా వాక్యంలో తడిసి
ఉప్పొంగి ఉబ్బిపోయింది
ఆకాశం ఎక్కడో కాదు తన చిగురుటాకు కొసనే
వున్నట్లు వూగిపోయింది
వొంటిని సాంతంగా వొంచి దండం పెట్టింది
తనను నిలబెట్టిన నేలతల్లికి కాదు
తనను మైమరిపించిన ఆ అక్షరజ్ఞునికి!

దగ్గర్లోనే దృఢంగా అనుభవ కాంతితో
ఎదిగిన మహావృక్షమొకటి
మోకరిల్లిన ఆ పసిమొక్కను చూసి జాలి పడింది
ఇక అది ఎప్పటికీ నిటారుగా లేవలేదని!
అటు ఆకాశాన్ని ఎట్లాగూ అందుకోలేదు సరి కదా
ఇటు నేలకూ దూరమై పోయింది కదా అని!
వాత్సల్య పూర్వకంగా చెబుదామనుకుంది కానీ
వినే సోయిలో మొక్క లేదని దానికి చూపులోనే
తెలిసిపోయింది, కనుక చెప్పలేదు

ఆ అక్షరజ్ఞుడు విలాసంగా వెళ్లిపోయాడు
తన వాక్యం మెరుపుకు మరీ మరీ మురిసిపోతూ
తన కిరీటాన్ని సగర్వంగా సవరించుకుంటూ

వాక్యంలోంచి విశేషణం మాత్రం రాలి
సిగ్గుతో చితికిపోయింది
మొక్క వొంగి మోకరిల్లిన చోటునే!
– దర్భశయనం శ్రీనివాసాచార్య, 9440419039