నర్సింగ్‌ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ వేగం పెంచాలి

– మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి : వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మెడికల్‌ కళాశాలలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన నర్సింగ్‌ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని రాజీవ్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నర్సింగ్‌ కళాశాలల్లో తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లపై మంత్రి సమీక్షిం చారు. తక్షణం విద్యార్థినులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో 15 మెడికల్‌ కళాశా లలకు అనుబంధంగా 15 నర్సింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో జనగాం, భూపాలపల్లి, కరీంనగర్‌, కొడంగల్‌, అందోల్‌, ఆసిఫాబాద్‌, మెదక్‌, కుత్బుల్లాపూర్‌, ములుగు, నారాయణపేట, నిర్మల్‌, రామగుండం, మహేశ్వరం, నర్సంపేట, యాదాద్రిలో నర్సింగ్‌ కళాశాల లున్నాయని చెప్పారు. రాష్ట్ర వైద్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా జడ్‌ చోంగ్తూ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌, రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఎండీ హేమంత్‌ సహాదేవ్‌రావుతో కలిసి సమీక్షించారు.