నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థులను ఖరారు చేయడంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్…టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఎన్‌ఎస్‌యూఐ అభ్యక్షులు బల్మూరు వెంకట్ పేర్లను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో మహేష్‌కుమార్‌గౌడ్ అసహనానికి గురైనట్టు తెలిసింది. ఎమ్మెల్యే కోటాల్లో ఎమ్మెల్సీ ఆశిస్తున్న వారిలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్, మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్‌యాదవ్, ఫిరోజ్‌ఖాన్ తదితరులు ఉన్నారు. గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్సీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
గవర్నర్ కోటాలో కోదండరాం, అమేర్ అలీఖాన్
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. అందులో టీజేపీ అధ్యక్షులు కోదండరాం, సియాసత్ న్యూస్ ఎడిటర్ అమేర్ అలీఖాన్ ఉన్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటాలోని అభ్యర్థుల పేర్లను బుధవారం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.