నవతెలంగాణ – కామారెడ్డి
వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకొని ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ విద్యార్థులకు ఉద్భోదించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి మండలంలోని గర్గుల్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో సంభాషించారు. విద్యార్థుల పాఠ్యాంశాల పై పలు ప్రశ్నలు వేసి, వారి సమాధానాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అటల్ టింకరింగ్ ల్యాబ్ ను పరిశీలించి మండలంలోని విద్యార్థులందరు షెడ్యూల్ ప్రకారం వినియోగించుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని కలెక్టర్ ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జడ్పీ సీఈఓ చందర్ నాయక్, డిఆర్డిఓ సురేందర్, ఎంఈఓ ఎల్లయ్య పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు.