– సినీ నటి మంచు లక్ష్మి
– గద్వాల జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాలల దత్తతకు ఒప్పందం
నవతెలంగాణ- జోగులాంబ గద్వాల
పేద విద్యార్థుల కోసమే పాఠశాలలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రముఖ నటుడు మోహన్ బాబు కూతురు, నటి మంచు లక్ష్మి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలలను టీచ్ ఫర్ చేంజ్ ఫౌండర్ మంచు లక్ష్మి దత్తత తీసుకుంటున్నట్టు కలెక్టర్ క్రాంతి సమక్షంలో బుధవారం ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ప్రయివేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిద్దేందుకు తమ సంస్థ పని చేస్తుందని తెలిపారు. గతంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో పూర్తిస్థాయిలో పనిచేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేసినట్టు చెప్పారు. చదువులో వెనుకబడిన జిల్లాలో ఇలాంటి సేవలు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఆగస్టు లోపు పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్, విద్యాశాఖ అధికారి సిరాజుద్దీన్ పాల్గొన్నారు.