– ప్రధాన టోర్నీకి మాళవిక బాన్సోద్
– మరో నాలుగు డబుల్స్ జోడీలు సైతం
– ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్
నవతెలంగాణ-నింగ్‌బో :
ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో టీమ్ ఇండియా షట్లర్లు సానుకూల ఆరంభం అందుకున్నారు. మంగళవారం అర్హత రౌండ్‌లో భారత క్రీడాకారులు అదరగొట్టారు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బాన్సోద్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించగా.. డబుల్స్ విభాగాల్లో నాలుగు జోడీలు సైతం ప్రధాన డ్రాకు చేరుకున్నాయి. అర్హత రౌండ్లో మాళవిక బాన్సోద్ వరుసగా 21-8, 21-0తో, 21-4, 21-5తో ఏకపక్ష విజయాలు నమోదు చేసింది. మహిళల డబుల్స్ అర్హత రౌండ్లో సిమ్రన్ సింగ్, రితిక ఠాకూర్‌లు 21-11, 21-16తో, 21-10, 21-18తో అలవోక విజయం సాధించారు. రుతుపర్ణ పండ, శ్వేతపర్ణ పండ జంట సైతం వరుస మ్యాచుల్లో 21-18, 21-16తో, 21-6, 21-6తో ప్రధాన టోర్నీకి చేరుకున్నారు. మెన్స్ డబుల్స్‌లో హరిహరన్, రూబన్ కుమార్‌లు 21-15, 21-7తో, 21-10, 21-5తో వరుస మ్యాచుల్లో గెలుపొందారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సతీశ్ కుమార్ కరుణాకరన్, ఆద్య జోడీ 21-6, 21-4తో, 21-11, 21-8తో సాధికారిక విజయాలతో ప్రధాన టోర్నీలో అడుగుపెట్టారు. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ ప్రధాన టోర్నీ మ్యాచులు నేటి నుంచి షురూ కానున్నాయి.
మనోళ్లపైనే ఫోకస్ :
బ్యాడ్మింటన్ పవర్‌హౌస్‌గా ఎదుగుతున్న తరుణంలో మన షట్లర్లు అనూహ్యంగా ఫామ్ కోల్పోవటం ఆందోళనకు దారితీస్తోంది. డబుల్స్ సర్క్యూట్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ జైత్రయాత్ర కొనసాగుతున్నా.. సింగిల్స్ సర్క్యూట్‌లో సింధు, లక్ష్యసేన్, శ్రీకాంత్ అంచనాలను అందుకోవటం లేదు. 2024 పారిస్ ఒలింపిక్స్ అర్హత పాయింట్ల కేటాయింపునకు ఈ టోర్నమెంట్ ఆఖరు కావటంతో భారత షట్లర్లపై అంచనాలను ఎక్కువగా ఉన్నాయి. పి.వి సింధు, లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్ ప్రణరు, ప్రియాన్షు రజావత్ సహా ట్రెసా జాలి, పుల్లెల గాయత్రి జోడీ, అర్జున్, కపిల జోడీ నేడు తొలి రౌండ్లో బరిలోకి దిగుతున్నారు. మలేషియా షట్లర్ జిన్ వీతో సింధు తలపడనుండగా.. టాప్ సీడ్ షి యూకీతో లక్ష్యసేన్ తాడోపేడో తేల్చుకోనున్నాడు. కిదాంబి శ్రీకాంత్ సైతం రెండో సీడ్ ఆంటోని జింటింగ్‌తో తొలి రౌండ్లోనే కఠిన సవాల్‌కు సిద్ధమయ్యాడు. ప్రియాన్షు రజావత్, హెచ్.ఎస్ ప్రణరులకు సైతం కఠిన డ్రాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్‌లో ట్రెసా జాలి, పుల్లెల గాయత్రిలు నాల్గో సీడ్ చైనా జోడీతో పోటీపడనుండగా.. తనీశ క్రాస్టో, అశ్విని పొన్నప్ప జోడీకి వాకోవర్ లభించింది. 17వ సీడ్ ఇండోనేషియా షట్లర్లు పోటీ నుంచి తప్పుకోగా తనీశ, అశ్వినిలు నేరుగా రెండో రౌండ్‌కు చేరుకున్నారు.