హైదరాబాద్ : నగర కేంద్రంగా తన కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ప్రముఖ ప్రవేట్ ఈక్విటీ పెట్టుబడిదారు సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ ముందుకు వచ్చింది. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగంలో రెండు బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.16,650 కోట్లు) మేర భారీ పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు వచ్చింది. శుక్రవారం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ పట్వారి, ఆపరేటింగ్ పాట్నర్ వైదీష్ అన్నస్వామి, మంత్రి కెటిఆర్‌తో ప్రగతి భవన్లో సమావేశమై తమ సంస్థ పెట్టుబడులను, విస్తరణ ప్రణాళికలను చర్చించారు. ఈ భారీ పెట్టుబడి ద్వారా తమ సంస్థ ఏపీఐ, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అగ్రస్థానంలో నిలిచేందుకు దోహదపడుతుందని తెలిపింది. తమ పెట్టుబడితో పాటు జినోమ్ వ్యాలీలో 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అడ్వెంట్ ఇంటర్నేషనల్ తెలియజేసింది. అడ్వెంట్ ఇంటర్నెషనల్ సంస్థ హైదరాబాద్ సువెన్ ఫార్మస్యూటికల్ కంపెనీలో దాదాపు 9,589 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నది. దీంతోపాటు తన కోహన్స్ ప్లాట్ఫారం ద్వారా మరిన్ని సంస్థలలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది.