వరిలో గంధక దుష్ప్రభావ నివారణ చర్యలు పాటించాలి

– రాయపోల్ ఏఈవో ప్రశాంత్.

నవ తెలంగాణ- రాయపోల్ 
వరి పంటలో గంధక దుష్ప్రభావ నివారణ చర్యలు పాటించాలని,వరి పైర్లు గంధక దుష్ప్రభావం వలన తీవ్రంగా నష్టపోతున్నారని రాయపోల్ ఏఈఓ ప్రశాంత్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం మరియు వేసంగిలో ఒకే పొలంలో సంవత్సరాలు తరబడి వరి సాగుచేయడం వలన వరిలో ‘‘సల్ఫైడ్‌’’ దుష్ప్రభావాన్ని గమనిస్తామన్నారు. ‘‘సల్ఫైడ్‌’’ దుష్ప్రభావం వలన 30-50 శాతం వరకు పంట దిగుబడి నష్టపోవడం జరుగుతుందన్నారు. వరిలో ఇటువంటి పరిస్థితికి కారణం స్థానికంగా అధిక నీటి ముంపు, తగిన రీతిలో పంట వేర్లకు గాలి అందకపోవటం నేలలో రసాయన చర్యల వలన మార్పు చెందడం జరుగుతుందన్నారు. ఇనుము ధాతువు లోపం ఉండే పొలాల్లో అలాగే బరువు నేలల్లో సల్పైడ్‌ కలిగిన 20-20-0-13 లాంటి కాంప్లెక్సులను అధికంగా వాడటం లేదా సింగిల్‌ సూపర్‌ ఫాస్పెట్‌ని గాని లేదా అమ్మేనియం ‘‘సల్ఫైడ్‌’’ని గాని ఎక్కువగా వాడటం వలన ఈ ‘‘సల్ఫైడ్‌’’ దుష్ప్రభావాన్ని పొలంలో గమనించవచ్చన్నారు. అలాగే సాధారణంగా చెరువుల క్రింద పొలాల్లో, కాలువల కింద నీటి పారుదల ఎల్లప్పుడూ ఉండే పొలాల్లో ‘‘సల్ఫైడ్‌’’ దుష్ప్రభావాన్ని ఎక్కువగా గమనిస్తాము. ఈ ‘‘సల్ఫైడ్‌’’ దుష్ప్రభావం వలన వరి నేలల్లో, పంట మధ్యకాలంలో అక్కడక్కడ గుంపులు గుంపులుగా బాగా పెరిగిన పంట మొత్తము పసుపు వర్ణములోకి మారి ఎదుగుదల క్షీణిస్తుందన్నారు.పొలంలోకి దిగి గమనించినట్లయితే మట్టి మెత్తగా ఉండి కాలు చాలా లోతుగా దిగబడిపోతుందని తెలిపారు. అలాగే మట్టి నుంచి కుళ్ళిన వాసనను మనం గమనిస్తామన్నారు. పొలంలో నడుస్తున్నప్పుడు బుడగల రూపంలో గాలి బయటికి రావడం చూస్తాము. నేల నుంచి దుర్గందపు వాసన మరియు మొక్కను వేర్లతో సహా బయటికి తీసినప్పుడు కూలిపోయిన గుడ్ల వాసన వస్తుంది. వేర్లు పూర్తిగా నల్లగా మారి జీవము లేక కుళ్ళిన వాసన వస్తుందన్నారు. ఈ ‘‘సల్ఫైడ్‌’’ దుష్ప్రభావం వలన మొక్కలు ఎదుగుదల క్షీణించి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నారు.దీని దుష్ప్రభావం నివారణకు పైరు వేయటానికి మడిని తయారు చేయుటకు ముందు ఇటువంటి ప్రాంతాల్లో 1-2 బండ్ల ఎర్రమట్టిని వేసి బాగా కలియబెట్టి ఆరబెట్టడం, భూమిని ఎత్తు చేయటం చేయాలి. పొలంలో ఎత్తు వంపులు లేకుండా సమానంగా ఉండే విధంగా పొలాన్ని తయారు చేసుకోవాలన్నారు. నీరు ఎక్కువగా నిలువ ఉంటే ఈ ‘‘సల్ఫైడ్‌’’ దుష్ప్రభావం గమనిస్తాం. పంట కాలంలో దుష్ప్రభావం కనిపించినప్పుడు మొక్క వేర్లకు తగిన గాలి తగిలే విధంగా మురుగు నీటిని తీసి పంటను ఆరబెట్టాలి. అదేవిధంగా పొలాన్ని సన్న నెట్టెలు వచ్చే వరకు ఆరగట్టి అప్పుడప్పుడు మళ్ళీ నీరు అందివ్వాలి. అమ్మోనియం ‘‘సల్ఫైడ్‌’’ వంటి ఎరువులను ఇలాంటి పొలాల్లో వాడరాదు. లీటర్ నీటికి ప్రోపినెబ్ 3గ్రాములు లేదా 2 గ్రా కార్బెండజిమ్ మరియు మంకోజెబ్ మరియు  10 గ్రా 19.19.19 మరియు 3గ్రా ఫార్ములా 4 మిశ్రమాన్ని కలిపి పిచికారి చేయాలి తెలియజేశారు.ఇలాంటి జాగ్రత్తలు పాటించనట్లయితే వరిలో గంధక దుష్ప్రభావ నివారణ చేపట్టవచ్చున్నారు.