న్యూఢిల్లీ : చల్లగా వుండాల్సిన హిమాలయాల్లో వాతావరణాన్ని వేడెక్కించడంలో ఏరోసోల్స్ (పొగ, పొగమంచు, దుమ్ము, ధూళి వంటివి) గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయని పరిశోధకులు పేర్కొంటు న్నారు. అలాగే హిమనదాలు కరిగిపోవడాన్ని వేగ వంతం చేయడంలో కూడా ఇవి ముఖ్య పాత్రే పోషిస్తున్నాయి. హిందూ కుష్-హిమాలయ- టిబెటన్ పీఠభూమి (హెచ్‌కెహెచ్‌టిపి) ప్రాంతంలో ఘనీభవించే పద్ధతుల్లో మార్పులకు కూడా ఇవి కారణమవుతున్నాయి.
మొత్తంగా ఈ ప్రాంతంలో దిగువ వాతావరణం పూర్తిగా వేడెక్కడానికి సగానికి పైగా ఏరోసోల్స్ కారణం కాగా, మిగిలిన భాగం కాలుష్య కారక వాయువుల వల్ల వేడెక్కుతోందని అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ లేబరేటరీ, జర్మనీలోని లీప్జిగ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల బృందం సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.
ఈ ప్రాంతంలో వాతావరణ మార్పుల వెనుక ప్రధానమైన అంశంగా ఏరోసోల్స్ వున్నాయని అధ్యయనం పేర్కొంది. ఇండో-గాంగ్‌టిక్ ప్లెయిన్ (ఐజిపి)- భారత దేశంలోని గంగానదీ పరీవాహక ప్రాంతాలు(భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లో పలు ప్రాంతాలు ఇందులోకే వస్తాయి. దక్షిణాసియా ప్రాంతంలో జనసాంద్రత కలిగి, పారిశ్రామికీకరణ చెందిన ప్రాంతాలు ఇందులో వున్నాయి) , హిమాలయ పర్వత సానువులు, టిబెట్ పీఠభూమి ప్రాంతాల్లో పలు చోట్ల ఏరోసోల్స్ ఘనీభవనలు, దానివల్ల పుట్టిన వేడిమిని గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ”ఇవన్నీ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అత్యంత సున్నితమైన పర్యావరణ వ్యవస్థలు కలిగిన ప్రాంతాలు, అదే సమయంలో అత్యంత తీవ్రమైన ముప్పును కలిగించే జనాభా కలిగిన ప్రాంతాలు, వీటిపై అధ్యయనం కూడా చాలా తక్కువగా జరిగింది.” అని వారు తమ అధ్యయన పత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుతమున్న వాతావరణ నమూనాలు ఏరోసోల్స్ కారక వేడిమిని, హెచ్‌కెహెచ్‌టిపి ప్రాంతంలో వార్మింగ్ పరిస్థితులను గణనీయంగా తక్కువ అంచనా వేస్తున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏరోసోల్ లక్షణాలకు సంబంధించి మరింత వాస్తవిక ప్రాతినిధ్యం కోసం పరిశోధకులు పిలుపిచ్చారు. సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్‌మెంట్ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.