ఆప్యాయతలు.. ఆలింగనాలు…

‘దేనికైనా టైం రావాలి బ్రో…’ అనేది ఇప్పుడు మనం వింటున్న ఓ కామన్‌ డైలాగ్‌. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలు, అసమ్మతివాదులకు ఆ టైం వచ్చింది.. అది కూడా మాంచిగా కలిసొస్తోంది. లేకపోతే మొన్నటి దాకా సీటివ్వలేదని సీఎం కేసీఆర్‌ సాబ్‌ మీద కారాలు మీరాలు నూరిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య… ఏకంగా అక్కడ సీటు సంపాదించుకున్న మాజీ మంత్రి కడియం శ్రీహరిని దగ్గరుండి మరీ గెలిపిస్తానని చెప్పటమేంటి..? నేను లేస్తే మనిషిని కాదంటూ సీఎం మీద శివాలెత్తిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కేసీఆర్‌ పిలిచి మరీ ఆర్టీసీ చైర్మెన్‌గా చేయటమేంటి..? ఈ సీట్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపిస్తానంటూ చేతిలో చెయ్యేసి ముత్తిరెడ్డి చెప్పటమేంటి..? ఏంటంటే… నథింగ్‌ బట్‌… అంతా ఎన్నికల మాయ అంటున్నారు బీఆర్‌ఎస్‌ జనాలు. ఇక్కడ గమ్మత్తేమంటే… మొన్నటిదాకా ప్రగతి భవన్‌ తలుపు కాడ బాస్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురు చూసి, చూసీ కండ్లు కాయలుగాసిన ఇలాంటి నేతలకు సార్‌ దర్శనభాగ్యం కలగలేదు. కానీ ఎన్నికలు దగ్గర పడుతుండటం, మైనంపల్లి హన్మంతరావులాంటి వారు రాజీనామాలు చేయటం, కాంగ్రెస్‌ స్పీడ్‌ పెరగటం తదితర పరిణామాలతో ప్రగతిభవన్‌ తలుపులు ఒక్కసారిగా తెరుచుకోవటం మొదలుపెట్టాయి. సారు ఆగ్రహాలు, అసంతృప్తుల ఆవేశాల స్థానంలో ఆప్యాయతలు, ఆలింగనాలు షురూ అయ్యాయి. ఆ వెంటనే అసమ్మతి నేతలను పదవులు వరిస్తున్నాయి. అబ్బ… మస్తు రంజుగుంది రాజకీయం.
-బి.వి.యన్‌.పద్మరాజు