అఫ్గాన్‌, ఇంగ్లాండ్‌ పోరు యథాతథం

Afghanistan England battle status quo– 2025 ఐసీసీ మెన్స్‌ చాంపియన్స్‌ ట్రోఫీ
లండన్‌ : ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో అఫ్గనిస్థాన్‌, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌పై నెలకొన్న నీలినీడలు నెమ్మదిగా తొలుగుతున్నాయి. అప్గనిస్థాన్‌లో తాలిబన్లు మహిళలపై జరుపుతున్న నిరంకుశ లింగ వివక్షకు వ్యతిరేకంగా ఇంగ్లాండ్‌లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. సుమారు 160 మంది బ్రిటీష్‌ రాజకీయ నాయకులు చాంపియన్స్‌ ట్రోఫీలో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని గళం విప్పారు. అఫ్గనిస్థాన్‌, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ లాహోర్‌లో ఫిబ్రవరి 26న షెడ్యూల్‌ చేశారు. తాజా వివాదంపై ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) చైర్మెన్‌ రిచర్డ్‌ థామ్సన్‌ స్పందించారు. ‘అఫ్గనిస్థాన్‌లో లింగ వివక్ష జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌లో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తుండగా.. అఫ్గనిస్థాన్‌లో అవకాశాలను నిరాకరిస్తున్నారు. అఫ్గాన్‌ను వీడిన మహిళా క్రికెటర్లను ఏ విధంగా సహాయం చేయాలనే కోణంలో బోర్డు ఆలోచన చేస్తుంది. అఫ్గనిస్థాన్‌లో మహిళల క్రికెట్‌పై ఐసీసీతో మాట్లాడుతాం. ఎంతోమంది సాధారణ అఫ్గాన్‌ పౌరులకు అతికొద్ది వినోదాల్లో క్రికెట్‌ ఒకటి. చాంపియన్స్‌ ట్రోఫీలో ఆ జట్టుతో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ పోటీపడుతుంది’ అని రిచర్డ్‌ తెలిపాడు.