ఇంఫాల్ : దాదాపు 10 రోజుల విరామం తరువాత మణిపూర్‌లో విద్యాసంస్థలు మంగళవారం పున:ప్రారంభమయ్యాయి. ఈ నెల 7న జరిగిన రాకెట్ దాడుల్లో ఒకరి మృతి, అనేక మంది గాయపడిన తరువాత నుంచి రాష్ట్రంలో మూడు జిల్లాలో కర్ఫ్యూ విధించడంలో పాటు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల పున:ప్రారంభానికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (పాఠశాలలు), ఉన్నత-సాంకేతిక విద్యా శాఖ సోమవారం రాత్రి జారీ చేసింది. అలాగే ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, తౌబాల్ జిల్లాల్లో మంగళవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కర్ఫ్యూ సడలిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విద్యాసంస్థలను మంగళవారం నుంచి పున:ప్రారంభించారు.