పొద్దు వాలిపోయాక!

పొద్దు వాలిపోయాక!వసారాలో మంచం మీద ఉన్న రాఘవయ్యకు మెలకువ వచ్చింది. పక్షం రోజులుగా పట్టని నిద్ర నిన్న పట్టింది. రాత్రి తాగిన కల్లు తేన్పుకి వచ్చింది. మంచం మీద నుండి కాళ్ళు కింద పెట్టి ఎప్పుడు చూసే వైపు చూశాడు. అదే తను ఉంటే… అక్కడో పళ్ళు తోముకునే వేప పుల్ల, పక్కనే ఓ బకెట్‌లో నీళ్ళు అందులో మగ్గు ఉండేది.
ఇన్ని రోజులుగా అనిపించనిది ఈరోజు అనిపిస్తోంది తను ఒంటరినని. ఆరు గదులున్న ఇల్లు నిండా ఒక్కడే. మనసులో ఏదో వెలితి అనిపిస్తుంటే దర్వాజా మీదకు చూపు తిప్పాడు. ఇంకా పూర్తిగా వాడిపోని పూల దండలోనుండి, రూపాయి కాసంత ఎర్ర బొట్టు, ముక్కుకు బేసరి, చిరునవ్వులు చిందిస్తూ అయోధ్యమ్మ మొహం.
‘ఇన్నాళ్లుగా పరీక్షగా చూడనే లేదు. ఎంత అందంగా ఉందనీ! ప్రతి రోజూ ఇల్లంతా వెలుతురు పరచినట్టుండే నవ్వు మాయమై పక్షం రోజులు అయింది. ఇన్నేళ్లల్లో తను లేకుండా ఉన్న రోజులు లెక్క పెడితే పట్టుమని పది రోజులు కూడా ఉండవు. పుట్టింటికి వెళ్ళినా ఉదయం వెళితే సాయంత్రం కల్లా రావలసిందే’.
వణుకుతున్న కాళ్లతో నెమ్మదిగా లేచి ఇంటి పక్కకు నడిచాడు. ఇంటి సందులో గాడి పొయ్యిలు. రెండు రోజుల కిందనే పెద్ద కర్మ పూర్తయింది. అదే రోజు వచ్చిన బంధువులు అందరూ వెళ్ళిపోయారు. చావుకి వచ్చినా, చావుకి సంబంధించిన కర్మలకు వచ్చినా ఆ రోజు నిద్ర చేయకూడదని అంటారు. అసలు అవసరమే అప్పుడు అయినప్పుడు, ఆ పద్ధతి ఎందుకు వచ్చిందో తెలియదు.
”నాన్నా… మళ్ళీ ఓ పది రోజుల్లో వస్తాను. అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో?” అంటూ ఉన్న ఒక్క కొడుకూ భార్యా పిల్లలను కూడా తీసుకొని నిన్న వెళ్లిపోయాడు.
‘తను మరీ వృద్ధుడేం కాదు కదా’ అన్న ఆలోచనతో వెళ్ళి ఉండొచ్చు.
అసలు ఇది ఇల్లులా అనిపించలేదు రాఘవయ్యకి. భుజం మీదనున్న కండువా సరి చేసుకుంటూ… ఇంటి వెనుక వైపుకు నడిచాడు. అక్కడ కట్టెల పొయ్యి, పక్కనే రుబ్బురోలు. రాఘవయ్యకు కట్టెలపొయ్యి వంట, రోటి పచ్చడి అంటే ఇష్టం.
దానికి మరో అడుగు దూరంలో కల్లుముంత పెట్టి ఉంది. దానిని చూస్తూనే కడుపులో దేవేసినట్టయింది. లోపలనుండి గొంతులోకి పుల్లగా వచ్చిన నీటిని బయటకు ఊస్తూ విసురుగా తన్నాడు దాన్ని. అలాగే పడిపోయాడు.
***
”ఎక్కడ చచ్చావే?” రాఘవయ్య ఇంటికి వస్తూనే అరిచాడు.
పొలం నుండి వస్తూనే తాటి తోపుల్లో వాడుక పట్టిన కల్లు అడ్డా దగ్గరికి వెళ్ళి వస్తాడు. వస్తూ వస్తూ మరో ముంత తెచ్చుకుంటాడు. లేదా కల్లు గీసే అతను ఇంటికి పంపుతాడు.
”ఆ…ఆ… ఇక్కడే ఉన్నా…” ఇంటి వెనుక పొయ్యి దగ్గర నుండి అయోధ్యమ్మ కేక వినపడింది.
”నీకు పొగరు నెత్తికెక్కిందే… కదలకుండా అక్కడే ఉండి ఎదురు సమాధానం చెపుతావా?”
వింటూనే ఎదురుగా పరుగెట్టుకొచ్చింది. అప్పటికే చేతిలో ఉన్న పట్టుడు కర్ర లేపాడు. పిల్లీ, ఎలుకా ఆట మొదలయ్యింది. అలసిన రాఘవయ్య వెనుక ఉన్న కల్లు ముంత దగ్గర కూల బడ్డాడు. మళ్ళీ తాగుడు మొదలెట్టాడు.
ఇది ఒక్క రోజుకు మాత్రమే పరిమితమైన ఆట కాదు, ప్రతీ రోజూ ఇదే తంతు. భోజనాల దగ్గర కూడా మళ్ళీ హింస మొదలవుతుంది.
”తింటావా అయ్యా?”
”ఏం నువ్‌ చెబితే తప్ప తిననా… నేర్పుతున్నావా?” అని,
ఒకవేళ అడగక పోతే…”తింటావా అని కూడా అడగలేవా? నువ్వు తింటే సరిపోద్దా…” అని కర్ర అందుకుంటాడు.
అయోధ్యమ్మ ముందు తింటే తప్పు, తినకపోతే తప్పు. ముందే పక్క పరచుకొని పడుకుంటే తప్పు, అల్లా కాకుండా పడుకోకుండా రాఘవయ్య పడుకునే వరకు ఎదురు చూస్తే తప్పు.
మొత్తం మీద కొట్టడానికి అవకాశం సృష్టించుకొని మరీ కొడతాడు. దాదాపు ఆయోధ్యమ్మ వంటి నిండా దెబ్బల గురుతులే.
***
ఓరోజు రాఘవయ్య బావమరిది వచ్చాడు. ఇదంతా చూసి
”పద… ఇన్ని అగచాట్లతో ఇక్కడేం ఉండనక్కర లేదు. ఈ మాత్రం ముద్ద మేం పెట్టలేకపోము. పద” అని అక్కను తీసుకుపోయాడు.
కల్లు తాగిన రిమ్మ మీద ఉన్న రాఘవయ్య పట్టించుకోలేదు.
ఒక నిద్ర పోయి లేవగానే జరిగింది గుర్తుకు వచ్చింది. లేచిన వాడు లేచినట్లే కాళ్ళకు చెప్పులు వేసుకొని బయల్దేరాడు. తెల్లారే సరికి అత్తగారింటి ముందు ఉన్నాడు. చుట్టు పక్కల ఇళ్ల వాళ్ళు నవ్వుతూ చూస్తున్నారు. అదేమీ పట్టించుకోలేదు… అసలు ఆ ధ్యాస లేదు. ఇంతలో బయటికి వచ్చిన బావమరిది మొహం తిప్పుకొని తండ్రిని కేకేసి వెళ్లిపోయాడు. ఏంట్రా అని బయటికి వచ్చిన మామ రాఘవయ్యను చూస్తూనే పరుషంగా ఏదో అన్నాడు. కానీ అవేవీ రాఘవయ్య చెవిన బడటం లేదు. ఆయన కళ్ళు భార్యను వెతుకుతున్నాయి.
సందడేంటో అనుకుంటూ.. ముగ్గు గిన్నె పట్టుకొని వచ్చిన అయోధ్యమ్మ భర్తను చూస్తూనే తెల్లబోయింది.
చూస్తూనే… పెళ్ళాం ముందుకు వెళ్ళి ఆమె మోకాళ్ళ మీద తలబెట్టుకొని కూలబడ్డాడు రాఘవయ్య. మొగుడి కళ్లలోకి లోతుగా…. చూపు అతని గుండెను చేరిందాక చూసింది. అంతే! లోపలికి వెళ్ళి తన బట్టలు సర్దుకొని, బయటికి వచ్చి భర్త చేయి పట్టుకొని బయల్దేరింది. ఆ తరువాత ఆమె తన పుట్టింట్లో ఎన్నడూ నిద్ర చేయలేదు. ఏనాడన్నా వచ్చినా సందేళ్లకల్లా ఇంట్లోనే ఉంటుంది.
అలా అని రాఘవయ్య తన అలవాట్లేమీ మార్చుకోలేదు.
ఇదేమీ అర్థం కానీ అయోధ్యమ్మ తల్లి ఆరా తీయబోతే..
”అమ్మా! ఆయనకి అదొక్కటే చెడ్డ అలవాటు. కల్లు తాగకుండా ఉండలేడు. తాగితే మనిషి కాడు. ఆ పూట సర్దుకుంటే… ఇంతా చేసి ఓ రెండు మూడు గంటలు. తర్వాత నిద్రపోతాడు. తెల్లారితే పసిపిల్లాడు. ఈ ఒక్క దానితో ఎలా అమ్మా ఆయనను వదిలేది?”
అయోమయంగా ”ఇదో పిచ్చిది.. దెబ్బలు కొడుతుంటే వళ్ళు అప్పచెప్పేదాన్ని దీన్నే చూశాను. దీని ఖర్మ” అని తల కొట్టుకునే తల్లిని చూసి నవ్వేసేది అయోధ్యమ్మ.
***
రాఘవయ్యకు కల్లు తాగడమే కాదు. పెళ్లాన్ని కంట్రోలు చేస్తున్నానని నలుగురిముందు చెప్పుకోడమూ అలవాటే. ప్రతీ రాత్రి అతని వీరంగం చూసిన వారు అతని మాట సులభంగా నమ్మే వారు. పొద్దంతా పని చేయడం, సాయంత్రానికి తాగి వీరంగం వేయడం తప్ప ఇంకేమీ తెలియదు. కానీ అతని ప్రతి బలహీనతను అతని గొప్పతనంగా నవ్వుతూ చెప్పేది. అలాగే భావిస్తున్నట్లు కనిపించేది. కానీ…. ప్రతీ రోజు సాయంత్రం అతను నిద్రపోయేంతవరకు గుండెలు ఉగ్గ బట్టుకుంటూ గడిపేది. మూడేళ్ళ తర్వాత ఆమెతో పాటు కొడుకు కూడా….
చూస్తుండగానే కొడుకుకి కాలేజీ వయసు వచ్చింది. కాలేజీ వివరాలు, హాస్టల్‌ గురించి వాకబు చేయడం, చేర్చడం అంతా తనే… రాఘవయ్య వెంట ఉండేవాడు అంతే.
అయోధ్యమ్మ ప్రతి రూపాయి దాచేది. తెలిసిన వారికి వడ్డీకిచ్చేది. చదువురాని ఆమె తమ ఇంట్లో ఉన్న నోటుని చూసి అది ఎవరికి డబ్బులు ఇచ్చిన తాలూకు కాగితమో, ఎంతయ్యిందో నోటి లెక్కలతో చెప్పగలిగేది. అంత పరిశీలనా, జ్ఞాపక శక్తి, చాకచక్యంతో రెండు ఎకరాల పొలాన్ని అయిదు ఎకరాలకు పెంచింది.
”ఇదంతా మా ఆయన శ్రమ ఫలితం. ఆయన ఆ దిక్కుమాలిన తాగుడు అలవాటు తప్పిస్తే ఆ రాఘవుడి లాంటి వాడే” అనేది. ”కొడుక్కి బెంగుళూరులో ఉద్యోగం వచ్చింది కూడా ఆయన పుణ్యమే” అంటూ తనదేమీ లేనట్టు, మొగుడి బుగ్గలు పుణుకుతూ చెప్పేది. ఆమె చెప్పే ప్రతి మాట పిల్లాడిలా వినే రాఘవయ్య సాయంత్రం అయితే అతను ఇతనేనా అన్నట్లు ప్రవర్తించేవాడు. ఏనాడూ రాత్రి ఏం జరిగిందో మరుసటి రోజు రాఘవయ్యకు చెప్పలేదు, అతను అడగలేదు.
***
ఇలా సాగుతున్న వాళ్ళ జీవితాల్లో ఒక్క మాదిరిగా కుదుపు. అయోధ్యమ్మకు సుస్తీ చేసింది. ఎంతకీ తగ్గడం లేదు. విషయం తెలిసిన కొడుకు వచ్చి నగరానికి తీసుకొని వెళ్ళాడు. అంతా బాగుందని చెప్పినా…. నిర్ధారించలేని వ్యాధి కారణంగా… ఫలితం లేకపోయింది. వంట్లో జరుగుతున్న మార్పులు తనకు తెలుస్తున్నా పైకి బింకంగా రోజులు నెట్టుకొస్తూ… కొడుకుని ఉద్యోగానికి పంపింది.
ఇంకా ఒక వారం రోజుల్లో చనిపోతుందనగా రాఘవయ్య చేయి పట్టుకొని వెళ్లిపోయేటట్టే ఉన్నాను. నేను పోతే నువ్వెలాగయ్యా?” అంది.
గుండెల్లో సూదులు గుచ్చుతున్నట్లు విలవిలలాడిపోయాడు. పసి పిల్లాడిలా భార్య వొళ్ళో పడి కన్నీరు పెట్టుకున్నాడు.
”ఊరికే అంటున్నా లేవయ్యా! నిన్ను వదిలి ఎటు పోతాను” అంటూ నవ్వేసింది.
ఒక్కరోజూ తాగుడు మానని రాఘవయ్య ఒక వారం నుండి దాన్ని ముట్టుకోవట్లేదు. ఆ విషయాన్ని మాటి మాటికీ అంటూ మురిసిపోయేది. రోజుకో విషయం చెబుతూ పిల్లాడిని ఒక చోట వదిలేటప్పుడు బుద్దులు చెప్పినట్లు చెప్పేది. అవి వింటూ మోయలేని దిగులు కమ్ముకుంటుంటే అల్లాడిపోసాగాడు రాఘవయ్య.
రోజు రోజుకి తినడం తగ్గి చిక్కి శల్యమైపోసాగింది. మరుసటి రోజు చనిపోతుందనగా కొడుక్కి ఫోన్‌ చేయించింది. పూసగుచ్చినట్లు అడుగుతూ ఒకసారి రమ్మని చెప్పింది. రేపే బయల్దేరమంది. భయంతో ఆగలేని కొడుకు వెంటనే బయల్దేరాడు.
ఆ రాత్రంతా మాట్లాడుతూనే ఉంది. ఏనాడూ రాత్రి పూట నోరెత్తని అయోధ్యమ్మ, భర్తను మాట్లాడనీయకుండా తను మాట్లాడాలని అనుకున్నవన్నీ మాట్లాడుతూనే ఉంది.
ప్రతి రోజూ రాత్రి ఏం జరుగుతుండేదో, తను ఎప్పుడు ఏం మాట్లాడాలనుకుందో, ఎప్పుడు కోపం ప్రకటించాలనుకుందో, ఎప్పుడు గారాలు పోవాలనుకుందో తరచి తరచి గుర్తుకు చేసుకొని మరీ మాట్లాడింది.
జీవితంలో ప్రతీ రాత్రీ తాగి వాగుతూ పడుకునే రాఘవయ్య, అందుకు విరుద్ధంగా ఆ రాత్రంతా వింటూనే ఉండిపోయాడు. తెలియని వ్యాధితో కళ తప్పిన భార్య మొఖాన్ని తడుముతూ, ఏం జరగబోతోందో అర్థం కాని అయోమయంతో, భయంతో చూస్తుండి పోయాడు. మొదటి సారి తన అశక్తతమీద తనకు కోపం వస్తోంది. వచ్చిన జబ్బు ఏమిటో చెప్పలేని, చికిత్స చేయలేని విజ్ఞానం మీద కోపం వస్తోంది.
ఉన్నట్టుండి భార్య చూపు నిలిచింది. ఆయన చెవికి మాట చేరడం లేదు. అరిచాడు. గట్టిగా… గొంతులోని రక్త నాళాలు పగిలిపోతాయనేంతగా అరిచాడు. ఉలిక్కి పడిన ఊరు కాసేపటిలో అక్కడికి చేరుకుంది. రాఘవయ్యను ఏనాడూ అలా చూడని ఊరు కరిగిపోయి చూస్తోంది. భయంతో చూస్తోంది. తెల్లారితే చేయాలిసిన పనులను మరిచిపోయి మరీ చూస్తోంది.
కాసేపటికి కొడుకు కుటుంబంతో దిగాడు. ఇది చూస్తూ ఒక్కసారిగా అందరూ ఘొల్లుమన్నారు. ఊరంతా తన ఇంటి దగ్గర చేరడాన్ని కొడుకు అదిరిపోయాడు. అంత దు:ఖంలోనూ తన కంటే పసిపిల్లాడిలా మారిన తండ్రిని విస్తుపోతూ చూశాడు.
అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. అందరూ వెళ్ళిపోయారు. కొడుకు కూడా వెళ్లలేక వెళ్ళాడు. ఆ రాత్రి మళ్ళీ కల్లు తాగాడు. కానీ నోట మాట లేదు. మత్తుతో సోయి తెలియకుండా నిద్రపోయాడు.
***
”రాఘవయ్య తాతా, రాఘవయ్య తాతా….” ఎవరో గట్టిగా కుదుపుతున్న దానికి స్పందనగా కళ్ళు తెరిచాడు.
జరిగిందంతా గుర్తుకు వచ్చింది. చివరి రోజుల్లో భార్య చెప్పిందంతా… చెవుల్లో రింగుమంటున్నది. ఈ ఒక్క అలవాటు లేకపోతే ఎన్ని జ్ఞాపకాలు ఉండేవి? ప్రతి రోజూ ఎంత నరకం చూసింది! అయ్యో.. తల బాదుకున్నాడు. అప్పటికే పగిలిన కల్లు కుండను నుగ్గు నుగ్గుగా తొక్కుతూ… తనకు చీమంత బరువు తెలియకుండా కుటుంబాన్ని దిద్దిన భార్య మొఖం కళ్ల ముందు నిలుపుకున్నాడు.
మళ్ళీ జీవితంలో అతను తాగడు. కానీ మత్తులో కోల్పోయిన సగం జీవితం మళ్ళీ రాదు. ఆనాటి నుండి ఏ ఆలూ మగల మధ్య గొడవ జరిగినా అక్కడ అతను ప్రత్యక్షమౌతాడు. సర్ది చెబుతాడు. తన అయోధ్యమ్మ గురించి, తను చేసిన తప్పులను గురించీ, నష్టపోయిన తన జీవితం గురించీ బాహాటంగా చెబుతాడు.
– బాడిశ హన్మంతరావు, 9908486615