పెండ్లి తర్వాత…

After marriage...పెండ్లయిన తర్వాత అందరి జీవితాల్లో కొన్ని మార్పులు కచ్చితంగా వస్తాయి. బాల్యం నుండి పెండ్లి అయ్యే వరకు జీవితాలు ఒకలా ఉంటాయి. పెండ్లి తర్వాత వచ్చే ఈ మార్పులు సర్వసాధారణం. అయితే అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిలు అప్పటి వరకు తాము పుట్టి పెరిగిన ఇంటిని వదిలి కొత్తగా అత్తగారింటికి వెళ్ళాలి. అక్కడంతా కొత్త వాతావరణం. కొన్ని ఆంక్షలు కూడా వచ్చి పడతాయి. తల్లి ఇంటిలో వలె స్వేచ్ఛగా ఉండే అవకాశం చాలా తక్కువ. ప్రతి దానికీ భర్త, అత్తమామల పర్మిషన్‌ తీసుకోవల్సి వస్తుంది. అదే ఇద్దరూ కొత్తగా వేరు కాపురం పెడితే ఆ సమస్యలు వేరే ఉంటాయి. అలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఓ జట కథే ఈ వారం ఐద్వా అదాలత్‌…

మీనాకు 24 ఏండ్లు ఉంటాయి. రమేష్‌తో పెండ్లి జరిగి ఎనిమిది నెలలు అవుతుంది. ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగ రీత్యా ఇద్దరూ సిటీలో కొత్త కాపురం పెట్టారు. పెండ్లయి ఎక్కువ రోజులు కాలేదు. పైగా పెద్దలు కుదర్చిన వివాహం కాబట్టి ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకోడానికి కొంత సమయం పడుతుంది. దీని కోసం ఇద్దరూ ఒకరితో ఒకరూ కొద్ది సేపు గడపడం, ఒకరి ఇష్టాలు మరొకరు పంచుకోవడం చేయాలి. అప్పుడే ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతుంది.
కానీ మీనా, రమేష్‌ల ప్రవర్తన విచిత్రంగా ఉంది. పైగా వారిద్దరి మధ్య ఏమైనా సమస్యలు వస్తే సరిదిద్దే వారు ఎవ్వరూ దగ్గర్లో లేరు. మీనా తల్లిదండ్రులు గానీ, అత్తమామలు గానీ వచ్చి వీరి దగ్గర ఉండే అవకాశం లేదు. వాళ్లు ఊళ్ళో వ్యవసాయం చేస్తారు. దాన్ని వదిలి సిటీలో ఎక్కువ రోజులు ఉండలేరు. ఒక వేళ వచ్చినా ఒక్కరోజు ఉండి వెళ్లిపోతారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మీనా, రమేష్‌ ఇద్దరూ పెండ్లికి ముందు ఎలా ఉండేవారో పెండ్లి తర్వాత కూడా అలాగే ఉంటున్నారు. అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు ఉంటారు. బయటకు వెళ్లినా ఒకరితో ఒకరు చెప్పుకోరు.
రమేష్‌, మీనతో చెప్పకుండానే తన స్నేహితులను ఇంటికి తీసుకు వస్తుంటాడు. వచ్చిన స్నేహితులు మీన వంట గురించి కామెంట్లు చేయడం, ఇంటి పద్దతుల గురించి మాట్లాడుతుండేవారు. ఇదంతా ఆమెకు నచ్చేది కాదు. రమేష్‌ సహౌద్యోగుల్లో మహిళలు కూడా ఉండేవారు. వారు మీనా డ్రెస్సింగ్‌ గురించి మాట్లాడేవారు. ఇది ఆమెకు అస్సలు నచ్చేది కాదు. ఆ విషయం రమేష్‌తో చెప్పినా పెద్దగా పట్టించుకోడు. ఇంట్లో ఆమె ఒంటరిగా వుందని తెలిసి కూడా రమేష్‌ ఆలస్యంగా ఇంటికి వస్తాడు. ‘కొత్త చోటు నాకు ఒక్కదాన్నే ఉండటం ఇబ్బందిగా ఉంది’ అన్నా పట్టించుకునేవాడు కాదు. పైగా ‘నేను ఏం చేసినా నీకు ఇబ్బందిగానే ఉంటుంది. నేను ఏంచేయాలో, చేయకూడదో నీ దగ్గరి నుండి నేర్చుకోవాలా’ అనేవాడు.
దీంతో మీన కూడా ‘సరే నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నేను కూడా నాకు నచ్చినట్టుగా ఉంటాను’ అంటూ ఆమె తన స్నేహితులతో లేట్‌నై్‌ వరకు బయట వుండి ఇంటికి రావడం మొదలుపెట్టింది. ఇంట్లో వంట చేయడం మానేసింది. ‘నేను బయట తిని వచ్చాను. నీకు ఆకలిగా ఉంటే ఆర్డర్‌ చేసి తెప్పించుకో, లేకపోతే నువ్వే వంట చేసుకొని తిను’ అనేది. ఇలా ఇద్దరూ ప్రతి చిన్న విషయానికీ నామాటే నెగ్గాలి అనుకుంటూ పోట్లాడుకునేవారు. ఇది గమనించి ఇంటి పక్కనే ఉండే సుమతి వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ వాళ్లు గొడవ పడడం మాత్రం మానుకోలేదు. దాంతో సుమతి వారిద్దరినీ తీసుకొని ఐద్వా అదాలత్‌కు వచ్చింది.
మేము ఇద్దరినీ కూర్చోబెట్టి ‘పెండ్లి అంటే బాధ్యతగా వ్యవహరించాలి. అంతే గానీ ‘నువ్వు ఎక్కువా, నేను ఎక్కువగా’ అంటూ గొడవలు పడితే సంసారం సాఫీగా సాగదు. ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకోవాలి. ఏ పని చేసినా ఇద్దరూ కలిసి చేసుకోవాలి. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యలూ ఉండవు. ఇలా మీరు గొడవలు పడుతూ ఒక్కరోజైనా సంతోషంగా ఉన్నారా? మీరే ఆలోచించుకోండి. ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు. అదే ఒకరి గురించి ఒకరు ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు మీకే అర్థమవుతుంది. ప్రతి చిన్న విషయానికి గొడవ పడడం సరైనది కాదు. బయటకు వెళ్ళాలనుకుంటే ఇద్దరూ కలిసి వెళ్ళండి. ఎవరి దారిన వారు మీ స్నేహితులతో తిరుగుతుంటే ఇక మీ గురించి మీరు ఎప్పుడు తెలుసుకుంటారు. కొత్తగా పెండ్లయిన వారు ఎంత సంతోషంగా ఉండాలి? అనవసరమైన ఈగోలకు వెళ్ళి హాయిగా గడపాల్సిన సమయం మొత్తం గొడవలతో గడుపుతున్నారు.
ఇప్పటి నుండి ఇద్దరూ కలిసి వంట చేసుకోవడం, ఇల్లు సర్దుకోవడం వంటివి చేయండి. వారానికి ఒకసారి ఇద్దరూ కలిసి సరదాగా బయటకు వెళ్లండి. ఎవరి స్నేహితులు ఇంటికి వచ్చినా ముందు ఒకరితో ఒకరు చెప్పుకోండి. ఇద్దరూ ఒక మాటపై ఉండి వాళ్లను ఇంటికి ఆహ్వానించండి. భార్యాభర్తలంటే ఇలా ఉండాలి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లుంటే అది సంసారం కాదు’ అని ఇద్దరికీ సర్ది చెప్పాము.
తర్వాత రమేష్‌తో ‘మీ భార్య డ్రెస్సింగ్‌ గురించి ఇతరులు మాట్లాడే అవకాశం ఇవ్వకండి. ఆమె ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో ఆమె నిర్ణయించుకుంటుంది. మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే ప్రేమగా ఆమెకు చెప్పుకోండి’ అని చెప్పాము.
అలాగే మీనాతో ‘నువ్వు కూడా నీ పద్దతులు కొన్ని మార్చుకోవాలి. ఇంట్లో ఎలా ఉండాలో, బయట ఎలా ఉండాలో నేర్చుకో. ఇద్దరూ ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోండి. అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు. ఇద్దరి మధ్య ఏమైనా సమస్య వస్తే మా దగ్గరకు రండి’ అని చెప్పాము.
దానికి ఇద్దరూ ‘నిజమే మేడం, ఇప్పటి వరకు మేము ఒకరి గురించి ఒకరం తెలుసుకునే ప్రయత్నమే ేయలేదు. ఎప్పుడూ మా స్నేహితులు, మా ఉద్యోగాల గురించే ఆలోచించాము. ఇకపై మీరు చెప్పినట్టే చేస్తాం’ అని చెప్పి వెళ్లిపోయారు.

– వై వరలక్ష్మి, 9948794051