ఎన్నికలప్పుడు ఒక మాట.. అయిపోయాక మరో మాట

ఎన్నికలప్పుడు ఒక మాట.. అయిపోయాక మరో మాట– ఇదీ కాంగ్రెస్‌ నైజం
– మెదక్‌ పార్లమెంటులో భారీ మెజార్టీతో గెలవాలి : సన్నాహక సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎన్నికలప్పుడు ఒక మాట మాట్లాడి… అవి ముగియగానే ఇంకో మాట మాట్లాడటం కాంగ్రెస్‌కి వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. అదీ ఆ పార్టీ నైజమంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ లో మెదక్‌ ఎంపీ సీటుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్‌ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై విమర్శలు గుప్పించారు. వాటిని అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ఆయా హామీలను ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ చేసిన తప్పులను కాంగ్రెస్‌ ప్రశ్నించడం లేదనీ, అలాగే కాంగ్రెస్‌ చేసిన పొరపాట్లను బీజేపీ ఎత్తి చూపటం లేదని తెలిపారు. అందువల్ల ఎవరు ఎవరికి బీ టీమో అర్థమవుతోందంటూ వ్యాఖ్యానించారు. మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ కు కంచుకోట అని ఆయన గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఆధారంగా చూస్తే ఆ ఎంపీ స్థానంలో తమ పార్టీ 2.48 లక్షల ఓట్ల ఆధిక్యంతో ఉందన్నారు. అందువల్ల మెదక్‌ పార్లమెంటు స్థానంలో భారీ మెజార్టీతో గెలవాలంటూ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. అందుకోసం కష్టపడి పని చేయాలంటూ పిలుపునిచ్చారు.
అన్ని స్థాయిల్లోనూ శిక్షణా కార్యక్రమాలు : హరీశ్‌ రావు
బీఆర్‌ఎస్‌ బలోపేతం కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలందరికీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో నిజమైన మార్పు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మెదక్‌ పార్లమెంటు సన్నాహక సమావేశం సందర్భంగా శుక్రవారం తెలంగాణ భవన్‌లో కార్యకర్తలను ఉద్దేశించి హరీశ్‌ రావు మాట్లాడుతూ ఆ ఎంపీ స్థానంలో ఏడింటికి ఆరు అసెంబ్లీ స్థానాలను బీఆర్‌ఎస్‌ గెలిచిందని గుర్తుచేశారు. తద్వారా అక్కడి నాయకులు కేసీఆర్‌ పేరు నిలబెట్టారని అభినందించారు. వారందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తాత్కాలికమేననీ, రెట్టించిన ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికల్లో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.