అసద్‌ పతనం ఆ తరువాత లిబియా బాటలో సిరియా పయనిస్తే…

After the fall of Assad If Syria follows the path of Libya...– నెల్లూరు నరసింహారావు

కొన్ని వారాల క్రితం వరకు సిరియాలో ఎటువంటి చలనాలు బయటకు కనిపించలేదు. నవంబర్‌ 27న హయత్‌ తహ్రీర్‌ అల్‌-షామ్‌ (హెచ్‌ టీ ఎస్‌), టర్కిష్‌-మద్దతుగల సిరియన్‌ నేషనల్‌ ఆర్మీ (ఎస్‌ ఎన్‌ ఏ) గ్రూపులకు చెందిన మిలిటెంట్లు అలెప్పోపై ఆకస్మిక దాడిని ప్రారంభించినప్పుడు యావత్‌ ప్రపంచం ఆశ్చర్యపోయింది. తాజాగా వారు నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల తరువాత, అధికారిక సిరియన్‌ సైన్యం హమా వ్యూహాత్మక నగరాన్ని విడిచిపెట్టింది. దక్షిణ , ఆగేయంలో నిద్రాణమైన తిరుగుబాటు దారులు చెలరేగిపోయారు. అసద్‌ బలహీన పాలనపై తుది దెబ్బ కొట్టారు. ప్రతిపక్ష దళాలు డమాస్కస్‌పై అనేక దిశల నుంచి దాడి చేశాయి. ఒక దశాబ్దం పాటు అంతర్యుద్ధాన్ని ఎదుర్కొన్న బషర్‌ అల్‌-అసద్‌ చివరకు పదవీచ్యుతుడయ్యాడు.
మూడేండ్ల క్రితం అమెరికా మద్దతుగల అష్రఫ్‌ ఘనీ ప్రభుత్వం పేకమేడలా కూలిపోయిన దృశ్యంతో సిరియాలో అసద్‌ ప్రభుత్వ పతన వేగం ఆఫ్ఘనిస్తాన్‌తో సారూప్యతను సూచిస్తోంది. కానీ ఘనీ బలహీనత సుస్పష్టం. అసద్‌ ఇప్పటికీ సిరియాలో ఆధిపత్య శక్తిగా విస్త ృతంగా గుర్తించబడ్డాడు. అందుకే అతని ఆకస్మిక పతనం మరింత దిగ్రాభంతికి గురి చేసింది. అసద్‌ పాలనలో సిరియా కొన్నేళ్లుగా లోపల నుంచి కుతకుతలాడుతోంది. దేశం శాశ్వత మానవతా , ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. 90 శాతం సిరియన్లు పేదరికం, విస్త ృతమైన పోషకాహార లోపంతో జీవిస్తున్నారు. నిరాశకు గురైన కుటుంబాలు కేవలం ఆహారం కొనడానికి అప్పులు తీసుకున్నాయి కానీ వాటిని తిరిగి చెల్లించలేకపోయాయి. విద్యుత్తు అంతరాయాలు డమాస్కస్‌ను కూడా నిర్వీర్యం చేశాయి. కొన్నిసార్లు రాజధాని రోజుకు 20 గంటలపాటు చీకటిలో ఉండేది. 2024 వసంతకాలంలోనే విద్యుత్‌ ధరలు 585 శాతం వరకు పెరిగాయి. ఇది సిరియా నిరుపేద జనాభాను మరింత నిరాశలోకి నెట్టింది.
అసద్‌ ప్రభుత్వం ఈ సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను అందించకపోగా అణచివేతను తీవ్రతరం చేసింది. అణచివేత, ఆంక్షల కారణంగా, డమాస్కస్‌ విదేశీ రుణాలను పొందలేకపోయింది. దాని చమురు క్షేత్రాలు అమెరికా-కుర్దిష్‌ నియంత్రణలో ఉండటంతో వర్తకం చేయడానికి ఏమీ లేదు. ఒకప్పుడు జీవనాధారంగావున్న సిరియా అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం దేశ ఆర్థిక వ్యవస్థలో అంతరాలను పూడ్చలేకపోయింది. లాభాలు ప్రభుత్వ ఖజానాకు కాకుండా సైనికుల, స్మగ్లర్ల జేబుల్లోకి పోయాయి. సైనికులకు అసద్‌ ఇ స్తున్న వేతనాలు తక్కువగా ఉండటంతో సైన్యంలో నిరుత్సాహం ఏర్పడింది.
అనేక సంవత్సరాల అంతర్యుద్ధం కారణంగా సిరియా ఎండిపోయి, విచ్ఛిన్నం అవుతూనే ఉంది. కొంతకాలం హిజ్బుల్లా వంటి ఇరానియన్‌ ప్రాక్సీలు అసద్‌ బలగాలకు మద్దతుగా నిలిచారు. కానీ 2024 లో వారు ఇజ్రాయిల్‌తో పోరాడటానికి తమ ద ృష్టిని మళ్లించారు. రష్యా ఉక్రెయిన్‌ తో చేస్తున్న యుద్ధంలో తలమునకలై ఉన్నందున సిరియాకు వెన్నుదన్నుగా ఉండలేకపోయింది. కాబట్టి అంతిమ సంక్షోభం వచ్చినప్పుడు, అసద్‌ ఒంటరిగా మిగిలిపోయాడు. అతని మిత్రులు దూరంగా ఉన్నారు. అతని సైన్యం నిర్వీర్యం అయింది. ఆకలితో ఆగ్రహంతోవున్న ప్రజలు ప్రభుత్వంపై తిరగబడ్డారు. అలా మరో నియంత శకం ముగిసింది.
అసద్‌ పతనం సిరియా భవిష్యత్తును ప్రమాదకరంగా అనిశ్చితంగా ఉంచుతుంది. హెచ్‌ టీఎస్‌ ఇప్పటికే అధికారం కోసం అర్రులు చాస్తోంది. టర్కీ మద్దతుతో తాలిబాన్‌-శైలిలో అధికారాన్ని కైవశం చేసుకోవలనే లక్ష్యంతో ఉంది. అయితే సిరియా ఆఫ్ఘనిస్థాన్‌ కాదు. దేశం వివిధ శత్రు వర్గాలతో నిండివుంది. ఎస్‌ ఎన్‌ ఏ, హెచ్‌ టీ ఎస్‌ లు ఒకప్పుడు ఇడ్లిబ్‌లో ఆధిపత్యం కోసం పోరాడాయి. రెండూ టర్కిష్‌ అనుకూలమైనవి అయినప్పటికీ. ఈశాన్యంలో కుర్ద్‌ లు, తీరంలో అలవైట్‌లు, దక్షిణాన డ్రూజ్‌ లు, ఆగేయంలో అమెరికా మద్దతుగల వివిధ వర్గాలు ఉన్నాయి. ఇప్పటికీ ఐసిస్‌ ఎడారిలో దాగి గందరగోళాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంది.
సిరియాలో సంభవించిన పెనుమార్పుతో ఒక కొత్త శకం ప్రారంభం అవుతుంది. అది ఇరాన్‌ విదేశాంగ విధానంతో సహా మధ్యప్రాచ్య భౌగోళిక రాజకీయాలను పెద్దగా ప్రభావితం చేస్తుంది. సిరియాతో లోతైన చారిత్రక, మతపరమైన, సాంస్క ృతిక సంబంధాలుగల ఇరాన్‌ మారుతున్న వాస్తవికతకు అనుగుణంగా దాని వ్యూహాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. సిరియన్‌ వివాదంలో ప్రముఖ పాత్ర పోషించిన ఇరాన్‌ సిరియాలో తన ప్రభావాన్ని పునఃపరిశీలించకపోతే అది ఒక మిత్రదేశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.అయితే, ఈ కొత్త అధ్యాయం ఇరాన్‌ కు కొత్త సవాళ్లను తీసుకురానుంది. ఇరాన్‌ టర్కియే, సౌదీ అరేబియా, పాశ్చాత్య దేశాల నుంచి పోటీని ఎదుర్కొంటుంది. ఈ దేశాలు సిరియాలో ప్రభావం కోసం పోటీ పడుతున్నాయి. ఈ దేశాలు ఏమాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించకపోయినా కల్నల్‌ గడాఫీ అనంతరం లిబియాలో చెలరేగిన అరాచక శక్తులవంటి శక్తుల బారిన సిరియా పడే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే అప్పుడు సిరియన్‌ సంక్షోభం సిరియన్లకు మాత్రమే కాకుండా మొత్తం మధ్యప్రాచ్యానికి విపత్తుగా మారుతుంది.