ఈ రోజుల్లో సిజేరియన్ డెలివరీలు సర్వసాధారణమైపోయాయి. నార్మల్ డెలివరీలో నొప్పుల్ని భరించలేకో, ఇతర అనారోగ్యాల వల్లో.. ఇలా కారణమేదైనా సి-సెక్షన్ డెలివరీల వైపే మొగ్గు చూపుతున్నారు కొందరు మహిళలు. అయితే సిజేరియన్ తర్వాత కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఆ తర్వాత కూడా దీర్ఘకాలంలో పలు అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు ఉంటాయని కొంతమంది భావిస్తుంటారు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సిజేరియన్ నొప్పుల నుంచి త్వరగా కోలుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
విశ్రాంతిని మించింది లేదు!
సిజేరియన్ తర్వాత తల్లులు ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత త్వరగా కోలుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కుట్లపై ఒత్తిడి పడకుండా అవి త్వరగా మానిపోవడానికి ఇది దోహదం చేస్తుందట! కాబట్టి తల్లైన తొలినాళ్లలో నిద్రలేమిని, ఒత్తిడిని జయించాలంటే ఇతర పనులు పక్కన పెట్టి పాపాయి నిద్రపోయినప్పుడే తల్లులూ నిద్రకు ఉపక్రమించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా ఈ సమయంలో ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో నడుంనొప్పి సమస్య కూడా రాకుండా జాగ్రత్తపడొచ్చట!
పాలిస్తే కోలుకుంటారు!
ప్రసవానంతరం పెరిగిన బరువు తగ్గడం దగ్గర్నుంచి కుట్లు త్వరగా మానిపోవడానికి, తిరిగి సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి, వెంటనే మళ్లీ గర్భం ధరించకుండా ఉండడానికి.. ఇలా ఎలా చూసినా బ్రెస్ట్ఫీడింగ్ బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది. అయితే పిల్లలకు పాలిచ్చే క్రమంలో తల్లులు కూర్చునే పొజిషన్ కూడా ఇక్కడ కీలకమే అంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా ముందుకి, వెనక్కి వంగిపోకుండా నిటారుగా కూర్చొని చిన్నారికి పాలివ్వాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సిజేరియన్ కారణంగా దీర్ఘకాలంలో నడుంనొప్పి రాకుండా జాగ్రత్తపడొచ్చు!
పోషకాహారం కావాల్సిందే!
సిజేరియన్ తర్వాత ఇది తినకూడదు, అది తాగకూడదు.. అన్న నియమనిబంధనలు ఇప్పటికీ చాలా ఇళ్లలో ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే పాలిచ్చే తల్లులకు ఎలాంటి పత్యాలూ అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. గర్భిణిగా ఉన్న సమయంలో సంపూర్ణ పోషకాలు లభించే పదార్థాలన్నీ ఎలాగైతే తీసుకుంటారో ప్రసవానంతరం కూడా అవే ఆహార నియమాలు పాటించాలని, తద్వారా సిజేరియన్ నొప్పుల నుంచి త్వరగా కోలుకోవచ్చని సలహా ఇస్తున్నారు. అలాగే పాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం కోసం ఆకుకూరలు, వెల్లుల్లి, కోడిగుడ్లు, పాలు, పాల పదార్థాలు, మాంసం, ఓట్మీల్, సోంపు.. వంటివన్నీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ముఖ్యం. ఇక సిజేరియన్ కారణంగా శరీరం కోల్పోయిన నీటి స్థాయుల్ని తిరిగి భర్తీ చేసుకోవడానికి, పాల ఉత్పత్తికి బాలింతలు రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగడం మంచిదట!