అఫ్జల్‌గంజ్‌ గ్రంథాలయంలో నాలుగున్నర లక్షల పుస్తకాలు

– లైబ్రరీ ముఖ్య గ్రంథ పాలకులు ఏవీఎన్‌ రాజు
నవతెలంగాణ-సుల్తాన్‌ బజార్‌
అఫ్జల్‌ గంజ్‌ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో వివిధ భాషలకు చెందిన నాలుగున్నర లక్షల పుస్తకాలు పాఠకులకు, విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని అఫ్జల్‌ గంజ్‌ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం ముఖ్య గ్రంథ పాలకులు ఏవీఎన్‌ రాజు తెలిపారు. బుధవారం రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం ఆవరణలో గల తెలంగాణ ప్రభుత్వ ప్రచురణల రిజిష్ట్రారు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయానికి రాజా రామ్మోహన్‌ రారు లైబ్రరీ ఫౌండే షన్‌ వారు నేషనల్‌ మిషన్‌ ఆన్‌ లైబ్రరీ స్కీంలో 9 లక్షల రూపాయలను విడుదల చేశారన్నారు. ఈ నిధులతో లైబ్రరీలో కంప్యూటర్‌, వివిధ రకాల సామాగ్రి తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్‌ (టీఎస్‌ టీఎస్‌) సంస్థ ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. గతంలో కూడా రూ. 8 లక్షల నిధులు విడుదల చేశారని చెప్పారు. ఆ నిధులతో లైబ్రరీలో ఫర్నిచర్‌, అల్మారాలు, కుర్చీలు, విద్యార్థులకు టేబులు, వివిధ రకాల సామాగ్రి కొనుగోలు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వ ప్రచురణల రిజిస్ట్రారు కార్యాలయంలో పరిశోధనాత్మక గ్రంథాలయం దిశ కార్యక్రమం త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. రెక్త ఫౌండేషన్‌ ఢిల్లీ ద్వారా ఉర్దూ పత్రికలు, హిందీ పత్రికలు డిజిటలైజేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ లైబ్రరీలో అరుదైన పుస్తకాలు, పాత పత్రికలు పాఠకులకు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రిజిస్ట్రారు ఆఫ్‌ పబ్లికేషన్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ వీవీఎల్‌ చంద్రకళ, రీడర్‌ గ్రేడ్‌ వన్‌ ఆఫీసర్‌ కేసరి హనుమాన్‌, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.