నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా నాల్గవ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బోర్గం (పి) గ్రామంలో వీడీసీల ఆగడాలు మితిమీరి రెచ్చిపోతున్నారు. అదే పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెలలో అనేక పర్యాయాలు వివిధ కులాలకు చెందిన వారిని కుల బహిష్కరణ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ కు సంబంధిత ఎస్ఐసిఐలు సమాచారం అందించి మరి కేసులను నమోదు చేశారు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. అయితే పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ గ్రామాల్లో చట్టవిరుద్ధ పనులు చేపడుతున్న వీడీసీలు చట్టానికి విరుద్ధంగా పనిచేయకూడదని అలా చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించినప్పటికీ స్థానిక పోలీస్ సిబ్బంది ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామ అభివృద్ధి కమిటీలకు తలొగ్గి పనిచేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆదివారం బోర్గం (పి) గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డిని కుల బహిష్కరణ చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు నాలుగో టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 15 రోజుల క్రితం గంగారెడ్డి అనే వ్యక్తిని కుల బహిష్కరణ చేశారు. కొన్ని నెలల క్రితం పద్మశాలి కులస్తులపై కుల బహిష్కరణ చేశారు. వీడీసీలు గ్రామాభివృద్ధికి కృషి చేయకపోగా, స్వార్థప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. వీడీసీలు గ్రామాభివృద్ధి కోసం పాటుపడాలని, స్వప్రయోజనాలు కోసం పనిచేస్తే శిక్ష తప్పదు అని సీపీ కల్మేశ్వర్ హెచ్చరించిన వీడీసీల తీరు మారడం లేదు. అయితే ఈ విషయంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారని వేచి చూడాల్సిన పరిస్థితి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాలుగో పోలీస్ స్టేషన్ పరిధిలో నెలకొంది. అలాగే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సైతం ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది ప్రతి ఒక్కరు గ్రామంలో ఆసక్తికరంగా వేచి చేస్తున్నారు.