నేటి సమాజానికి ప్రతిబింబమే మళ్ళీ పెళ్లి

నరేష్‌ వి.కె, పవిత్ర లోకేష్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఎం.ఎస్‌.రాజు రచన, దర్శకత్వం వహించగా, విజయ కృష్ణ మూవీస్‌ బ్యానర్‌ పై నరేష్‌ నిర్మించారు. ఈనెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా నాయిక పవిత్ర లోకేష్‌ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
‘చాలా విరామం తర్వాత ఈ సినిమాతో మళ్ళీ హీరోయిన్‌గా మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్‌ ప్రారంభం నుంచి పాత్రలపై దృష్టి పెట్టానే తప్ప హీరోయిన్‌గా చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. దర్శకులు గిరీష్‌ కాసరవెల్లి నన్ను కథానాయికగా చేసి, రెండు సినిమాలు తీయటం నా అదృష్టం. ఈ సినిమా మా బయోపిక్‌ కాదు. అయితే ఈ కథ సమాజానికి అద్దం పడుతుంది. ఇలాంటి పరిస్థితులు, ఆలోచనలు సమాజంలో ఉన్నాయి. అలాగే మనం సమాజంలో కొన్ని కండీషన్స్‌ పెట్టుకుని ఉంటాం. దాన్ని దాటితే బోల్డ్‌ అంటాం. ఈ రకంగా చూసుకుంటే ఇందులో చాలా బోల్డ్‌ ఉంటుంది. ఆడియన్స్‌ తప్పకుండా కనెక్ట్‌ అవుతారు. ఎంఎస్‌ రాజు ఈ కథ చెప్పినప్పుడు నచ్చింది. ఆయన దర్శకత్వంలో చేయడం ఆనందంగా ఉంది. ఆయన చాలా యూత్‌ఫుల్‌, ట్రెండీగా ఆలోచిస్తారు. ఈ కథని కూడా ట్రెండీగా ప్రజెంట్‌ చేశారు.
ఈ సినిమాలో చాలా మంచి మ్యూజిక్‌ ఉంది. మళ్ళీ ఫైనల్‌ కాపీ చూసిన తర్వాత చాలా సంతృప్తినిచ్చింది. అంత అద్భుతంగా వచ్చింది. ప్రస్తుతం ఒక కన్నడ సినిమా, అలాగే నితిన్‌తో ఓ సినిమా చేస్తున్నాను. ఇంకొన్ని కథలు వింటున్నాను’ అని తెలిపారు.