మళ్లీ ముదిరిన వివాదం

Again the dispute escalated– వీసీల నియామకంపై తొలగని ప్రతిష్టంభన
– సుప్రీంకోర్టును ఆశ్రయించిన స్టాలిన్‌ ప్రభుత్వం
చెన్నయ్‌: తమిళనాడులో స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులకు గ్రీన్‌సిగల్‌ ఇవ్వకుండా గవర్నర్‌ మోకాలడ్డడమే దీనికి కారణం. గవర్నర్‌ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతోంది. గవర్నర్ల తీరుపై ఆగ్రహంతో ఉన్న పంజాబ్‌, కేరళ ప్రభుత్వాలు కూడా ఇప్పటికే సుప్రీంను ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా గవర్నర్ల వ్యవహార శైలిపై న్యాయస్థానం అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 12 బిల్లుల్లో 11 బిల్లులు గవర్నర్‌ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విశ్వవిద్యాలయాల పాలనా వ్యవహారాలకు సంబంధించిన చట్టాల్లో మార్పులు చేస్తూ ప్రతిపాదించిన సవరణ బిల్లులు కూడా వీటిలో ఉన్నాయి. ప్రస్తుత చట్టాల ప్రకారం విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌గా గవర్నర్‌కు కొన్ని అధికారాలు ఉంటాయి. యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ను నియమించేది గవర్నరే. ఇప్పుడు ప్రభుత్వం ప్రాతిపాదించిన సవరణల్లో గవర్నర్‌ అధికారాలకు కోత పెట్టారు. ఈ సవరణ ప్రకారం యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ను ప్రభుత్వమే నియమిస్తుంది. అంతేకాక ఛాన్సలర్‌కు బదులుగా ప్రభుత్వమే విశ్వవిద్యాలయాల్లో తనిఖీలు చేస్తుంది. విచారణలు జరుపుతుంది. వైస్‌ ఛాన్సలర్‌ నియామకం కోసం అభ్యర్థుల్ని సూచించే కమిటీలో ఓ సభ్యుడిని నియమించే అధికారం కూడా ప్రభుత్వానికే ఉంటుంది. 1949వ సంవత్సరపు గుజరాత్‌ యూనివర్సిటీ చట్టం, 1991వ సంవత్సరపు తెలంగాణ యూనివర్సిటీల చట్టం తరహాలో విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్ల నియామకం విషయంలో గవర్నర్‌కు ఉన్న అధికారాలను నీరు కార్చేందుకు తమిళనాడులో అనేక బిల్లుల్ని రూపొందించారు. 2000వ సంవత్సరపు కర్నాటక యూనివర్సిటీల చట్టాన్ని కూడా తమిళనాడు శాసనసభ పరిశీలించింది. ఈ చట్టం ప్రకారం వర్సిటీల వైస్‌ ఛాన్సలర్లను నియమించేది గవర్నరే అయినప్పటికీ దానిని ప్రభుత్వ సమ్మతితోనే చేయాలి. శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదముద్ర వేసేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శాసనసభ ఆమోదించిన బిల్లుల్లో 11 బిల్లుల్ని 2020లో, ఏడు బిల్లుల్ని 2022లో, రెండు బిల్లుల్ని ఈ ఏడాది గవర్నరుకు పంపారు. వీటిలో 11 బిల్లులకు ఇప్పటికీ ఆమోదం లభించలేదు. దీంతో ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రం నియమించిన గవర్నరుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. బిల్లుల ఆమోదానికి గవర్నరుకు కాలపరిమితి విధించాలని కూడా తమిళనాడు ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్ల నియామకం కోసం సెర్చ్‌ కమిటీల ఏర్పాటు విషయంలో గవర్నర్‌ చట్టాలను ఉల్లంఘిస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ కూడా దాఖలు చేసింది. రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి కేవలం బిల్లుల్ని మాత్రమే పెండింగులో ఉంచలేదు. ప్రభుత్వం పంపిన నాలుగు ఫైల్స్‌ను కూడా తన వద్దే అట్టే పెట్టుకున్నారు. తంజావూరులోని తమిళ్‌ యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ పైన, నలుగురు మాజీ మంత్రుల పైన వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు అనుమతించాలని స్టాలిన్‌ ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది. వాటికి కూడా అతీగతీ లేదు. 54 మంది ఖైదీలను ముందస్తుగా విడుదల చేసేందుకు అనుమతించాలంటూ పంపిన రెండు ఫైల్స్‌కు కూడా గవర్నర్‌ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇంకో ముఖ్యమైన విషయమేమంటే తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల నియామకంపై ప్రభుత్వం పంపిన దరఖాస్తును కూడా గవర్నర్‌ తన వద్దే ఉంచుకున్నారు. టీఎన్‌పీఎస్సీలో ఛైర్మన్‌, 14 మంది సభ్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం నలుగురితోనే నెట్టుకొస్తున్నారు. దీంతో అనేక కీలక పదవుల్లో నియామకాల ప్రక్రియ ముందుకు సాగడం లేదు.