అక్రమ వలసలపై వేటు

Against illegal immigration– భారతీయులను వెనక్కి పంపిన అమెరికా
వాషింగ్టన్‌ : తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తరలించడానికి అమెరికా ఒక చార్టర్డ్‌ విమానం కిరాయికి తీసుకుని వారిని భారత్‌కు పంపివేసిందని అమెరికా హోంల్యాండ్‌ భద్రతా విభాగం తెలిపింది. భారత ప్రభుత్వ సహకారంతోనే ఇది జరిగిందని తెలిపింది. ఈనెల 22నే ఈ విమానం ఢిల్లీ చేరుకుందని వెల్లడించింది. ఎలాంటి చట్టబద్ధత లేకుండా అమెరికాలో కొనసాగే భారత జాతీయులను తక్షణమే పంపివేస్తామని హోం ల్యాండ్‌ భద్రతా డిప్యూటీ కార్యదర్శి (డిహెచ్‌ఎస్‌) బాధ్యతలు చూస్తున్న సీనియర్‌ అధికారి క్రిస్టీ కేన్‌గాలో తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 1,60,000మందిని వెనక్కి పంపించారు. 145కి పైగా దేశాలకు 495 పైగా అంతర్జాతీయ విమానాల్లో వీరిని పంపారు. ఇందులో భారత్‌ కూడా వుంది. అక్రమ వలసలను తగ్గించేందుకు అమెరికా అనుసరించే మార్గాల్లో ఇదొకటి. గతేడాది కాలంలో కొలంబియా, ఈక్వెడార్‌, పెరూ, ఈజిప్ట్‌, మారిటానియా, సెనెగల్‌, ఉజ్బెకిస్తాన్‌, చైనా, భారత్‌లతో సహా పలు దేశాలకు ఇలా తరలింపులు జరిగాయి.