– బీజేపీని ఎన్నికల్లో సాగనంపాలిొ ప్రజాస్వామిక హక్కులపై మోడీ ఉక్కుపాదం
– ప్రశ్నించే గొంతుకలను నొక్కుతున్న కాషాయ దళం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్
నవతెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
రాజ్యాంగ హక్కులను హరిస్తూ… లౌకిక విలువలకు పాతరేస్తున్న బీజేపీని మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్ అన్నారు. బీజేపీని ఓడించాలని కోరుతూ.. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సాయికృష్ణ ఫంక్షన్‌హాల్‌లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పద్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతుకలను నొక్కుతూ.. అప్రజాస్వామికంగా పరిపాలన సాగిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో సాగనంపాలన్నారు. మను ధర్మశాస్త్రాన్ని అమలు చేసేందుకు రాజ్యాంగాన్ని మార్చడానికి కూడా బీజేపీ వెనుకాడబోదని తెలిపారు. ఈ దేశంలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా.. ప్రజల దృష్టిని రామ మందిరం వైపు మళ్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వామపక్ష ఉద్యమాల వల్ల వచ్చిన ఉపాధి హామీ చట్టానికి నిధుల్లో కోతలు పెట్టి నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు.
సాగు పెట్టుబడికి 50 శాతం అదనంగా ఉండేలా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్న స్వామినాథన్ కమిషన్ సిఫారసులను తుంగలో తొక్కుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో ప్రతి రోజూ ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ నిత్యం బేటీ పడావో బేటీ బచావో అన్న నినాదం చేస్తున్నారు కానీ, మహిళలపై లైంగికదాడులు, హత్యలు చేసిన దుండగులను జైలు నుంచి బయటకు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్న ప్రజా మేధావులు వరవరరావు, సాయిబాబు లాంటి వారిని జైలులో పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడానికి.. కార్పొరేటు శక్తులకు అప్పగించడానికే యూనివర్శిటీలను ప్రయివేటు పరం చేస్తున్నారని విమర్శించారు. మతతత్వ విధానాలను పాఠ్యాంశాల్లో చేర్చి.. లౌకికవాదానికి చిచ్చు పెడుతున్నారన్నారు.
అదేవిధంగా, రాష్ట్రంలో గడువులోగా కాంగ్రెస్ హామీలను నెరవేర్చకపోతే ఎర్రజెండా ఉద్యమాలకు సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రాములు, కార్యదర్శివర్గ సభ్యులు కిల్లె గోపాల్, చంద్రకాంత్, కురుమయ్య, కడియాల మోహన్, మాణిక్యరాజు, నాయకులు రాజ్‌కుమార్, లక్ష్మయ్య, నర్సింహ, వేణుగోపాల్, ప్రశాంత్, భరత్, జగన్ సత్యం, నర్సింహ పాల్గొన్నారు.