మణిపూర్‌ హింసాకాండకు వ్యతిరేకంగా

– పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ తీర్మానం
కోల్‌కతా : మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండను ఖండిస్తూ పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ సోమవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సోవాందేవ్‌ చటోపాధ్యాయ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి, సభలో చదివి వినిపించారు. ఈ తీర్మానంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ మణిపూర్‌లో శాంతిని పునరుద్దరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌లో సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ‘మణిపూర్‌ పరిస్థితిపై ప్రధానమంత్రి ప్రకటన చేయాలి. ప్రధానమంత్రి విదేశీ పర్యటనలకు వెళ్లుతున్నారు. కానీ, మణిపూర్‌కు మాత్రం వెళ్లలేకపోతున్నారు’ అని మమతా విమర్శించారు. ఒకవేళ ప్రధానమంత్రికి మణిపూర్‌లో శాంతిని పునరుద్దరించడం సాధ్యం కాకపోతే, అందుకు తమను (ఇండియా కూటమి) అనుమతించాలని అన్నారు. కాగా, ఈ తీర్మానాన్ని బిజెపి వ్యతిరేకించింది. తీర్మానంపై చర్చలో పాల్గొన్న బిజెపి, ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం సభ నుంచి వాకౌట్‌ చేసింది.