అగాథంలోకి రూపాయి

అగాథంలోకి రూపాయి– 31 పైసలు పతనమై ఆల్‌టైం కనిష్ట స్థాయి 84.03కి..
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ రికార్డ్‌ స్థాయిలో పడిపోయింది. సోమవారం అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 31 పైసలు పతనమై ఆల్‌టైం కనిష్ట స్థాయి 84.03కి దిగజారింది. అమెరికాలో మాంద్యం భయాలకు తోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, భారత మార్కెట్ల భారీ పతనం తదితర పరిణామాలు రూపాయి విలువను మునుపెన్నడూ లేని విధంగా అగాథంలోకి పడేశాయి. భారతీయ ఈక్విటీ మార్కెట్ల తీవ్ర పతనం, విదేశీ నిధులు తరలిపోవడం ప్రభావం చూపాయని ఫారెక్స్‌ వ్యాపారులు తెలిపారు. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మార్కెట్‌లో రూపాయి విలువ 83.78 వద్ద ప్రారంభమైంది ఇంట్రాడేలో గరిష్ఠ స్థాయి 83.76 నుంచి 84.03 కనిష్ట స్థాయిని తాకింది. రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతులు భారం కావడంతో పాటు విదేశీ అప్పులపై అధికంగా చెల్లింపులు చేయాల్సి వస్తుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది.