ఎన్డిఏ ప్రభుత్వం మూడవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మొదటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం ఆగస్టు 15న ఎర్రకోట బురుజు నుండి వినబోతున్నాము. ఆయన ప్రసంగం వినడానికి, మూడు రంగుల జెండా ఆవిష్కరణను తిలకించడానికి వేలమందికి ప్రత్యేకంగా ఆహ్వానాలు వెళ్లాయి. అందులో నాలుగువేల ఆహ్వానాలు ప్రత్యేకంగా రైతులకు, మహిళలకు, యువకులకు, పేదలకు వెళ్లాయని, ఈ తరగతులకు ప్రధానమంత్రి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో ఇది వెళ్లడిస్తున్నదని అప్పుడే మీడియాలో కథనాలు మొదలయ్యాయి. విడ్డూరం ఏమంటే, బీజేపీ మోడీ పాలన మూలంగా ఏ తరగతులైతే ఎక్కువగా ఇక్కట్ల పాలవుతున్నారో ఆ తరగతులనే స్వాతంత్య్ర దినోత్సవ సంరంభానికి ఆహ్వానించడం.
బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం జూన్ 8న ఏర్పడ్డాక గడచిన రెండు నెలల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా కేంద్రం 2024-25 సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు సరిగ్గా రైతులకు, మహిళలకు, యువకులకు, పేదలకు నష్టదాయకంగా ఉన్నాయి. ఇప్పుడు వీరందరికీ ఎర్రకోటపై నుండి మోడీగారు ఇచ్చే సందేశం వాతబెట్టి పసరు రాసినట్టుగా ఉంటుంది. రైతుల పరిస్థితి చూస్తే, గత మోడీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను ఉపసంహరించాలని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని 2020లో దేశవ్యాపితంగా వీరోచిత పోరాటాన్ని సాగించారు. నెలల తరబడి ఢిల్లీ రాజధానిని దిగ్భంధనం చేశారు. ఉద్యమానికి తలొగ్గి నల్ల చట్టాలను రద్దు చేసినప్పటికీ, మోసపూరిత ఎత్తుగడలతో కాలయాపన చేసింది తప్ప, మద్దతు ధరకు చట్టబద్ధత ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదనేది బడ్జెట్ ప్రసంగాలు విదితం చేస్తున్నాయి. పైపెచ్చు మొన్న బడ్జెట్లో ఎరువులకు సబ్సిడీ తగ్గించారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్టు పెంచలేదు. ఇంకోవైపు వ్యవసాయంలోకి కార్పొరేట్లు ప్రవేశించడానికి వీలుగా అగ్రిస్టాక్ వంటి కొత్త ప్రతిపాదనలు చేశారు. రైతులు, ప్రత్యేకంగా పేద, మధ్యతరగతి, కౌలు రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలకు పరిష్కారాలు చూపకుండా, భూ వ్యాపారాన్ని వేగిరపర్చడానికి రాష్ట్రాలను ఒత్తిడి చేసేందుకు ప్రోత్సాహక పథకాలను సిద్ధం చేశారు. యువకుల పరిస్థితి మరీ అధ్వాన్నం. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని మోడీ వాగ్దానం చేసినప్పుడు యువకులు చాలా ఆశపడ్డారు. గత దశాబ్ద కాలంలో బీజేపీ ప్రభుత్వం ఉపాధి కల్పనలో ఘోరంగా విఫలమైంది. నిరుద్యోగం పెరిగింది. ఉపాధిని పెంచే పరిశ్రమలను, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడం కాకుండా మేక్ ఇన్ ఇండియా వంటి స్కీములన్నీ విదేశీ కంపెనీలు, ఉపాధి సృష్టించని హైటెక్ పరిశ్రమలు పెట్టుకోవడానికి తోడ్పడుతున్నాయి. తాజా బడ్జెట్లో ఉపాధి సృష్టికి ప్రకటించిన స్కీంలు ప్రభుత్వ సొమ్మును ఐదు వందల పెద్ద కంపెనీల బొక్కసం నింపడానికి వినియోగపడతాయి తప్ప, యువకులకు ఉపాధినిచ్చేవి కావు.
పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ఆశ్చర్యం గొలిపే అంశాలు ప్రస్తావించబడ్డాయి. మన పెట్టుబడిదారుల లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయని, కానీ వారు పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టడంలేదని, యంత్రాలు, పరికరాలు కొనేదానికన్నా విలాసాలకు ఖర్చు పెడుతున్నారని సర్వే వెల్లడించింది. ఇక ఎక్కడినుండి మన యువతకు ఉపాధి వస్తుంది. దేశంలోని యువతరం ఆటపాటల్లో వారు ఏం సాధించారనేది మన ప్రగతికి, దేశ ప్రతిష్టకు ఒక కొలమానం. పారిస్‌లో జరిగిన ఒలంపిక్స్‌లో మన దేశం ఒక వెండి, ఐదు కాంస్య పతకాలతోనే తిరిగి రావాల్సి వచ్చింది. రావలసిన కొన్ని పతకాలు తృటిలో తప్పిపోయాయి. ఎంతో సాధనచేసి పోటీల్లో పాల్గొన్న యువతీయువకులను మనం అభినందించాలి. అయితే మనం 140కోట్ల జనాభా కలిగిన, ప్రపంచంలో సంపన్న దేశాల పక్కన చేరాలని ఉవ్విళ్లూరుతున్న దేశంగా చూసుకున్నపుడు, మనం ఎక్కడు న్నామని ప్రశ్నించుకుంటే యువతరాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో అర్ధమవుతుంది. మన పాఠశాల, కళాశాలస్థాయి విద్యావిధానం ఎంత లోపభూయిష్టంగా ఉందో, మోడీ వచ్చిన తర్వాత నూతన విధానం పేరుతో అది మరింత అధ్వాన్నం ఎలా అయిందో ఆటల్లో వెనకంజ స్పష్టంగా వెల్లడిస్తుంది. యువతరం పట్ల మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యం తెలియ జేస్తుంది.
ఇక మహిళలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, ఇతర సామాజిక తరగతి గురించి చెప్పుకోనక్కరలేదు. ఈ తరగతులపై హింస, అత్యా చారాలు, నిత్యకృత్యమయ్యాయి. పితృస్వామిక భావజాలాన్ని, సనాతనవాదాన్ని గొప్పగా బీజేపీ నాయకులు, సంఫ్‌ు పరివార్ కీర్తిస్తున్న తరుణంలో బలహీనవర్గాలపై అవమానాలు, అఘాయిత్యాలు పెరగడంలో ఆశ్చర్యం లేదు. ఆరెస్సెస్ అనుకూల పత్రిక పాంచజన్యంలో, అత్యంత దుర్మార్గమైన కుల వ్యవస్థను దేశాన్ని సమైక్యంగా ఉంచే ఒక గొప్ప వ్యవస్థగా కీర్తిస్తూ రాశారంటే బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత సామాజిక అభివృద్ధి నిరోధకులకు ఎంత ధైర్యం వచ్చిందో చూడవచ్చు. గిరిజనుల పరిస్థితి మరింత దైన్యంగా మారింది. అడవులు, గనులు, కొండలను కార్పొరేట్ల లూటీకి అప్పగించడానికి, వారికి ఇచ్చిన రక్షణలన్నింటిని తొలగిస్తున్నా రు. అభ్యంతరం పెట్టినవాళ్ళపై క్రూర నిర్బంధం ప్రయోగిస్తున్నారు. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన వేలాది గిరిజన కుటుంబాలను పునరావాసం కల్పించకుండా రోడ్డున పడేశారు. మైనారిటీలైతే బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితిని సృష్టించారు.
పేదలను వాడుకుని విసిరేసే వస్తువులుగా మోడీ ప్రభుత్వం చూస్తున్నది. పేదలకు ఉపయోగపడే ఉపాధి హామీ పథకానికి వరుసగా కోతలు పెడుతున్నది. ఈ బడ్జెట్టులోనూ కేటాయింపులు తగ్గించింది. ఆహార సబ్సిడీని తగ్గించింది. ప్రభుత్వ ఆర్థిక సర్వే ప్రకారమే పెట్టుబడిదారుల లాభాలు ఇరవై శాతానికి పైగా పెరుగుతుంటే, కార్మికులు, కష్టజీవుల ఆదాయాలు పడిపోయాయి. మధ్య తరగతి ఆదాయాలు సైతం ఎదుగుబొదుగు లేకుండా ఉన్నాయి. పెద్ద పెద్ద భూ యజమానుల ఆదాయాలను కలుపుకుని లెక్కగట్టినా రైతు ఆదాయాలు ఒక్క శాతం మాత్రమే పెరిగాయి. ధరలు మాత్రం ఐదు శాతంపైనే పెరుగుతున్నాయి. పేదలు ఎక్కువగా వినియోగించే ఆహార పదార్థాల ధరలు పదిశాతం పైబడి పెరుగుతున్నాయి. అంటే నిజ ఆదాయాలు ఇంకా తక్కువగా ఉన్నాయన్నమాట. కనీవినీ ఎరుగని లాభాలు గడిస్తున్న కార్పొరేట్ల నుండి అదనపు పన్నులు వసూలు చేసి పేదల ఆదాయాలను పెంచే కార్యక్రమాలు చేపట్టకుండా, ఈ బడ్జెట్లో వారికి మరిన్ని రాయితీలు, తాయిలాలు మోడీ ప్రభుత్వం ఇస్తున్నది. ఇది పేదలపై మోడీ చూపిస్తున్న ప్రేమలోని కుటిలత్వం.
పైన ప్రస్తావించినవన్నీ ఒక ఎత్తయితే, మోడీ ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను విధ్వంసం చేసేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు మరో ఎత్తు. మూడవసారి అధికారం చేపట్టిన తర్వాత తీసుకుంటున్న చర్యలను చూసినా నిరంకుశ పాలనపై వేగంగా నడుస్తున్నట్లు గమనించవచ్చు. పౌర, నేర చట్టాలలో ప్రజాస్వామిక హక్కులకు భంగం కలిగే అనేక మార్పులు చేసారు. మీడియా నోరు నొక్కేందుకు కొత్త బ్రాడ్‌కాస్టింగ్ బిల్లును ప్రతిపాదిస్తున్నారు. ఒకదేశం – ఒకే ఎన్నిక కోసం రాజ్యాంగంలో తీవ్ర మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారు. మైనారిటీలకు నష్టం కలిగించే రీతిలో వక్ఫ్ బోర్డు చట్టానికి పలు సవరణలు తెస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో పౌరహక్కులను హరించే అనేక రాక్షస చట్టాలను తెస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నారు.
ఇటువంటి దుష్పరిపాలనను కప్పిపుచ్చుకోవడానికి స్వతంత్య్ర దినోత్సవాన్ని ప్రధానమంత్రి మోడీ ఉపయోగపెట్టుకుంటారు. వాగాడంబరంతో నిజాలను కప్పేస్తాడు. మభ్యపెట్టే వాగ్దానాలను చేస్తారు. మనకు తెలుసు మోడీ చెప్పేది ఒకటి, చేసేదొకటి అని.
అందుకే మనం కూడా ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని, ప్రజల జీవన ప్రమాణాలను రక్షించుకునేందుకు ఈ సందర్భంగా కృతనిశ్చయులం కావాలి.
బివి రాఘవులు