– 29న తిరిగి కొత్తగా విధుల్లోకి : విద్యాశాఖ ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సమగ్ర శిక్షలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ మల్లయ్య బట్టు మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. సమగ్ర శిక్షలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో సీఆర్సీలు, ఎంఆర్సీలు, డీపీవోల్లో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్లు (ఐఈఆర్పీలు), క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు (సీఆర్పీలు), డీఎల్‌ఎంటీ, మెస్సేంజర్లు, సిస్టం అనలిస్టులు, ఏపీవోలు, అకౌంటెంట్లు, డిస్ట్రిక్ట్ టెక్నికల్ పర్సన్లు, ఆఫీసు సబార్డినేట్లు, వాచ్‌మెన్ వంటి వారిని తొలగిస్తున్నామని తెలిపారు. పాఠశాల స్థాయిలో భవిత కేంద్రాలు, ఐఈఆర్సీల్లో పనిచేస్తున్న పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్లు హెల్పర్, ఆయాలను తొలగించామని పేర్కొన్నారు. 2024-25 వచ్చే విద్యాసంవత్సరానికి మూడు రోజుల విరామం తర్వాత అంటే ఈనెల 28న సాధారణ సెలవు దినం అయినందున 29న వారిని కొత్తగా విధుల్లోకి తీసుకుంటామని వివరించారు. ఆ ఉద్యోగులతో వ్యక్తిగతంగా తిరిగి ఒప్పందం కుదుర్చుకుంటామని స్పష్టం చేశారు. వచ్చే విద్యాసంవత్సరంలో పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్లు హెల్పర్, ఆయాల సర్వీసులను తీసుకునేందుకు ప్రత్యేకంగా ఉత్తర్వులను జారీ చేస్తామని తెలిపారు.
తొలగింపు విధానాన్ని ఎత్తేయాలి : సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం
సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ ఏటా తొలగించే విధానాన్ని ఎత్తేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం సురేందర్, కార్యదర్శి డి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం తొలగించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. మూడు రోజుల తర్వాత తిరిగి విధుల్లోకి తీసుకోవడమంటే ఉద్యోగులకు నష్టం చేయడమేనని విమర్శించారు. వారికి చాలీచాలని జీతాలిచ్చి, వెట్టిచాకిరి చేయిస్తున్నారని పేర్కొన్నారు. నెలరోజులపాటు సమ్మె చేస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరంగల్‌లో ధర్నాకు హాజరై సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇలా తొలగించి తమకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.