సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

నవతెలంగాణ- పెద్దవంగర: సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని మండల ఉపాధ్యాయ సంఘాల నాయకులు గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి, చిక్కాల సతీష్, ఎర్ర వెంకన్న, మధుసూదన్ రెడ్డి, చిట్యాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు మడిపెద్ది వెంకన్న డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరసన కార్యక్రమంలో వారు పాల్గొని, సంఘీభావం తెలిపారు. తెలంగాణ ఏర్పడడానికి ముందు కేసీఆర్ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అన్నారు. 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు, కేజీబీవీ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరేషన్ చేసేవరకు కనీస వేతనం అమలు చేయాలని, ప్రతి ఉద్యోగికి జీవిత బీమా, ఆరోగ్య భీమా కల్పించాలన్నారు. విద్యాశాఖ చేపట్టబోయే నియామకాల్లో మొదటి వెయిటేజీ కల్పించాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు గుర్రం శేఖర్, సీఆర్పీలు సంతోష్, నిరంజన్ తదితరులు.