న్యాయం చేయాలని ఆడపడుచు ఇంటి ఎదుట ఆందోళన

న్యాయం చేయాలని ఆడపడుచు ఇంటి ఎదుట ఆందోళననవతెలంగాణ-దండేపల్లి
అత్తింటి వారు వేధింపులకు గురి చేస్తూ తన భర్తను తనను విడదీస్తున్నారని ఓ యువతి సోమవారం మండల కేంద్రంలోని తన ఆడపడుచు ఇంటి ఎదుట న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకారం గ్రామానికి చెందిన సౌజన్య, కొండాపూర్‌ గ్రామానికి చెందిన ఇప్ప ప్రవీణ్‌ కుమార్‌తో 2013లో ప్రేమ పెళ్లి జరిగింది. వీరు ఇరువురికి ఒక బాబు ఉన్నాడు. పెండ్లయ్యాక ఏడాది నుంచి అత్తింటి వారు వేధింపులు గురి చేస్తున్నారని ముఖ్యంగా తన ఆడపడుచు తన భర్తకు వేరే పెండ్లి చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని సౌజన్య తన గోడు వెల్లబోసుకుంది. పోలీసు వారికి సైతం ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. చేసేది ఏమీ లేక తనకు న్యాయం చేయాలంటూ ఆడపడుచు ఇంటి ముందట నిరసనకు దిగాల్సి వచ్చిందని తనకు న్యాయం చేయకుంటే తన కొడుకుకు తనకు చావే శరణ్యమని పోరాటం చేస్తానని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఈ విషయమై దండేపల్లి ఎస్‌ఐ ఉదరు కిరణ్‌ వివరణ కోరగా ఇట్టి కేసుపై 2023 సెప్టెంబర్‌ లో చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌లో వరకట్నపు, గృహహింస వేధింపుల కేసు వారి కుటుంబ సభ్యులపై నమోదు అయిందని బాధితురాలు మెయింటెనెన్స్‌ కేసు సైతం వేశారని బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రవీణ్‌ కుమార్‌ కుటుంబ సభ్యులతో సైతం మాట్లాడడం జరిగిందని తెలిపారు. ఒకే విషయంపై రెండు చోట్ల కేసులు నమోదు చేయలేమని బాధితురాలికి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.